Vijaya Sai Reddy visakhapatnamపోలవరం ప్రాజెక్ట్ నిధుల పై కేంద్ర ప్రభుత్వం పెట్టిన మెలిక ఇంకా తేలలేదు. కేంద్రం చెప్పినట్టుగా 20,000 కోట్ల మేరే నిధులు ఇస్తే ప్రాజెక్టు పూర్తి అయ్యే అవకాశమే లేదు. ఆ విషయంపై కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చెయ్యకుండా అసలు విషయంపై నుండి దృష్టి మరలించే ప్రయత్నం చేస్తుంది అధికారపక్షం.

పోలవరం దగ్గర వైఎస్‌ విగ్రహం పెడతాం అంటూ తెర మీద కొత్త అంశాన్ని లేవనెత్తింది. కేవలం కాలువలు తవ్వి డబ్బులు దండుకున్న నాయకుడికి పోలవరంతో ఏమి సంబంధం అని ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వం ట్రాప్ లో పడినట్టుగా కనిపిస్తుంది. పోలవరానికి పునాది వేసింది వైఎస్సారేనని పేర్కొన్నారు. పోలవరం దగ్గర వైఎస్‌ విగ్రహం పెడితే తప్పేంటని ప్రశ్నించారు ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి.

“నిజమే పోలవరం ప్రాజెక్ట్ కు పునాది వేసింది వైఎస్ కానీ పునాది తప్ప ఆయన చేసింది ఏమీ లేదు. కాలువలు తవ్వి డబ్బులు దండుకున్నారు. ఆ సమయంలోనే ప్రాజెక్ట్ నిర్మాణం చేప్పట్టి ఉంటే ఇప్పటికే పూర్తి అయ్యేది. పునాది వేసిన వారికీ, శంకుస్థాపన చేసిన వారికీ విగ్రహాలు పెట్టుకుంటూ పోతే నిజంగా పని చేసిన చంద్రబాబు వంటి వారికి అన్యాయం చేసినట్టే,” అని టీడీపీ వారు ఆరోపిస్తున్నారు.

ఇకపోతే… పోలవరం ప్రాజెక్టు పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయన్నారు ఎంపీ విజయసాయి రెడ్డి. ఈ ప్రాజెక్టును చెప్పిన సమయానికి పూర్తి చేస్తామని విజయసాయిరెడ్డి వెల్లడించారు. నిధుల విషయంగా కేంద్రాన్ని ఎలా ఇరుకున పెడతారు అనేదాని మీద మాత్రం ఆయన దగ్గర సమాధానం లేకపోవడం విశేషం.