vijaya Sai Reddy bursts on yellow mediaఅధికార వైఎస్సాఆర్ కాంగ్రెస్ దాడులు, దౌర్జన్యాలను, అరాచకాలను రాష్ట్ర ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపాలనే ఉద్దేశంతో ప్రధానప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పిలుపునిచ్చిన ‘ఛలో ఆత్మకూరు’ను భగ్నం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేసింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రులు, ప్రస్తుత ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలను ఎక్కడిక్కడ హౌస్ అరెస్టులు చేసి ఆత్మకూరు పర్యటనను భగ్నం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు మీడియాలో ప్రముఖంగా ప్రసారం చేసింది.

జాతీయ మీడియాలో కూడా ప్రముఖంగా వచ్చింది. ఈ తరుణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి తీవ్రంగా స్పందించారు. “ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించిన ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేయడానికి ఇన్ని కుట్రలా? జూనియర్ ఆర్టిస్టులతో వరద బాధితుల వేషాలు. పల్నాడు వేధింపుల పేరుతో శిబిరాలు, నాణ్యమైన బియ్యం పైనా ఏడుపులు. వలంటీర్లకు పెళ్లిళ్లు కావని శాపాలు. ఐదేళ్లు ఎలా తట్టుకుంటారు,” అని విజయ సాయి రెడ్డి ట్విట్టర్ లో తిట్టిపోశారు.

“నిద్ర పట్టనోడు ఇంకా తెల్లారలేదని ఆకాశం వైపు రాళ్లు విసిరాడట. @ncbn, ఆయన ఎంగిలి మెతుకులు తినే బానిసలు, ఎల్లో మీడియా వ్యవహారం అలాగే ఉంది. ఎలక్షన్లకు 3 నెలల ముందు చేయాల్సిన ‘అతి’నంతా ఇప్పుడే మొదలు పెట్టారు. చిత్తు చిత్తుగా ఓడి 100 రోజులే అయింది బాబు గారూ,” అని మరో ట్వీట్ వేశారు. చంద్రబాబు, లోకేష్ మీద చేసిన విమర్శలు షరామామూలే కాబట్టి వదిలేద్దాం. మధ్యలో విజయసాయి రెడ్డి గారికి మీడియా మీద అక్కసు ఎందుకో? మీడియా ప్రభుత్వ బాకా ఊదాలంటే ఎలా? ప్రభుత్వం ఒక మాజీ ముఖ్యమంత్రిని హౌస్ అరెస్టు చేస్తే మీడియా చూపించకుండా ఎలా ఉండగలదు?