Vijay-Sai-Reddy-Tweetsవిజయసాయి రెడ్డి రాజ్యసభ అంటే పెద్దల సభలో సభ్యుడుగా ఉంటున్నారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా, వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, ఆ పార్టీ జాతీయ కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీ తదితర పెద్దలతో కలిసి తిరుగుతుంటారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తర్వాత అంతటివారనే పేరుంది. ఈ స్థాయిలో ఉన్న ఆయన ఎంత హుందాగా వ్యవహరించాలి?మాట్లాడాలి? కానీ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని, జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌, టిడిపి నేతలను ఉద్దేశ్యించి ట్విట్టర్‌లో ఆయన పెడుతున్న సందేశాలు సామాన్యులు సైతం సిగ్గుపడేలా ఉంటున్నాయి. ఏపీలో వైసీపీ, టిడిపిలు రాజకీయంగా శత్రువులే. కనుక పరస్పర విమర్శలు, ఆరోపణలు చేసుకోవడం సహజమే. కానీ వ్యక్తుల శరీరాకృతి గురించి, వారి వ్యక్తిగత జీవితాల గురించి చవుకబారుగా ట్వీట్స్ చేయడం ఎంతవరకు సమంజసం?

ట్విట్టర్‌ తదితర సోషల్ మీడియాలో వ్యక్తుల భావప్రకటన స్వేచ్ఛను గౌరవిస్తూనే ఎటువంటి అసభ్య సందేశాలకు, ఫోటోలకు, వీడియోలకు తావీయమని ఆయా సంస్థలు గొప్పగా చెప్పుకొంటాయి. కానీ ట్విట్టర్‌లో రాజకీయ నేతలు ఇంత నీచమైన సందేశాలు పెడుతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదో అర్దం కాదు.

ఆనాడు అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతటివాడిపై నిషేధం విధించిన సోషల్ మీడియా ఇప్పుడు తమ వ్యాపారాభివృద్ధి కోసం ఈ అసభ్య సందేశాలను చూసి చూడనట్లు ఊరుకొంటున్నాయి. అసలు సోషల్ మీడియా దేని కోసం ఉద్భవించింది? ఇప్పుడు దానిలో ఏం జరుగుతోంది?అని ఆలోచిస్తే ఇప్పుడు దానిలో మంచి కంటే చెడే ఎక్కువగా కనిపిస్తుంటుంది.

అసలు మన తెలుగు రాజకీయ నాయకుల సందేశాలను ట్విట్టర్‌ యాజమాన్యం ఎప్పుడైనా చూస్తోందో లేదో తెలీదు కానీ వాటితో ట్విట్టర్‌ పరువే పోతోంది. ట్విట్టర్‌లో ఉద్యోగులను తొలగించడం కాదు ఎలాన్ మస్క్ బాబు… ముందు ట్విట్టర్‌లో నుంచి ఈ రాజకీయ చెత్తను తుడిచిపెట్టకపోతే ట్విట్టర్‌ దుర్వాసన భరించడం కష్టం!
Vijay-Sai-Reddy-Tweets-Vijay-Sai-Reddy-Tweets-