Ligerహ్యాపెనింగ్ హీరో విజయ్ దేవరకొండ… పూరి జగన్నాధ్ ల కాంబినేషన్ లో వస్తున్న చిత్రం… లైగర్. ఇటీవలే ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. తెలుగులో దాదాపుగా అన్ని సినిమాలు లాక్ డౌన్ బ్రేక్ తరువాత షూటింగ్ మొదలుపెట్టగా లైగర్ మాత్రం ఎందుకనో మొదలుకాలేదు. ఆ సినిమా షూటింగ్ రేపు ముంబైలో మొదలుకాబోతుంది.

ఇది ఇలా ఉండగా… ఈ సినిమాను సెప్టెంబర్ 9న విడుదల చెయ్యడానికి చిత్రబృందం ఆలోచన చేస్తుంది. ఆ మరుసటిరోజు శుక్రవారం వినాయక చవితి సెలవు… ఆ తరువాత వారాంతపు సెలవులు కలిసి వస్తాయని వారి ఆలోచన. ఒకేసారిగా ఆ రోజున తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

లైగర్ విజయ్ దేవరకొండ మొట్టమొదటి పాన్-ఇండియా చిత్రం. కరణ్ జోహార్ ఈ చిత్రానికి ప్రెజెంటర్గా ఉన్నారు. దీనితో నార్త్ ఇండియా మార్కెట్లలో కూడా చిత్రానికి మంచి హైప్ రావడం ఖాయం. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్. రమ్య కృష్ణ, రోనిత్ రాయ్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.

బాక్సింగ్ నేప‌థ్యంలో సాగే ఈ చిత్రం కోసం విజ‌య్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్, ఇతర పోరాట కళల్లో శిక్షణ తీసుకున్నాడు. ఈ చిత్రంలో హీరో క్యారెక్టర్ కు ఉండే ఆటిట్యూడ్ కు దేశవ్యాప్తంగా యూత్ ఊగిపోతారు అని చిత్రబృందం కాన్ఫిడెంట్ గా ఉంది. అదే జరిగితే విజయ్ దేశవ్యాప్తంగా పెద్ద స్టార్ అయిపోవడం ఖాయం.