Vijay Vaarasuduప్రేక్షకులకు కొత్తగా ఏం చెప్పాలన్న తపన లేకపోతే రచయితలు దర్శకులు పాత కథలనే తిప్పి తిప్పి వడ్డించడం మినహా ఇంకేం చేయలేరు. నిర్మాత కంటెంట్ కన్నా ఎక్కువ హీరో క్రేజ్ మీద వందల కోట్ల బిజినెస్ జరిగితే చాలనుకుంటే ఇలాంటివి ఈజీగా తెరమీదకు వచ్చేస్తాయి. అలాంటి ఆణిముత్యమే వారసుడు. ఎన్నడూ లేనిది ఒక డబ్బింగ్ సినిమా థియేటర్ల గురించి ఇండస్ట్రీ వర్గాల్లోనే కాదు అభిమానుల్లోనూ విపరీతమైన చర్చకు గురైన చిత్రంగా దీని మీద చాలా డిబేట్లు జరిగాయి. ముందు మంకుపట్టు పట్టిన దిల్ రాజు ఆ తర్వాత చిరంజీవి బాలకృష్ణ కోసం నిర్ణయం మార్చుకున్నానని మూడు మూడు రోజులు వాయిదా వేసుకోవడం తెలిసిందే.

ఇంతకీ వారసుడులో ఏముందయ్యా అంటే సింపుల్ గా మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్. మార్కెట్ కు వెళ్లి ఫ్రెష్ వి కొనుక్కుని వస్తే రుచి బ్రహ్మాండంగా ఉంటుంది. అలా కాదని పాత మురిగిపోయిన పళ్ళను తీసుకొచ్చి రసం చేసి ఇస్తే ఇదుగో ఇలా ఓ కళాఖండంలా తయారవుతుంది. ఓ పెద్ద బిజినెస్ మెన్. ఆయనకు ఇద్దరు కొడుకులు. తండ్రి కంపెనీలను చెరొకరు భుజాన వేసుకుని కాపాడుతూ ఉంటారు. ఇంత తెలివితో వాళ్ళు సహాయపడుతుంటే ఆ పెద్దమనిషికి నమ్మకం ఉండదు. సరైన వారసుడుని త్వరలో ప్రకటిస్తానని పబ్లిక్ గా అనౌన్స్ చేస్తాడు. కట్ చేస్తే ఏడేళ్లుగా అలిగి ఇంటికి దూరంగా వెళ్ళిపోయిన చిన్నబ్బాయి అమ్మ అడిగిందని షష్టిపూర్తి కోసం వస్తాడు అతనే మన విజయ్.

సరే ఇంత చక్కని కుటుంబంలో చిచ్చుపెట్టడానికి ఒక విలన్ కావాలిగా ప్రకాష్ రాజ్ రెడీ. ఊరికే ఊగిపోతూ డాన్స్ చేసేందుకు రష్మిక మందన్న, వదిన పాత్రలో కన్నీళ్లు పెట్టుకోవడానికి సంగీత, పెద్దావిడగా జయసుధ, సూట్లు వేసుకున్నా అమాయకంగా ఆలోచించే అన్నలుగా శ్రీకాంత్, జై సిద్ధం. ఇంకేం ఇవన్నీ సెట్ చేసుకున్న దర్శకుడు వంశీ పైడిపల్లి కథ కోసం ఎందుకు కష్టపడాలని గత పదేళ్లలో వచ్చిన హిట్లలో నుంచి చెరో మూడు నాలుగు సీన్లను తీసుకుని స్క్రిప్ట్ రాసేశాడు. బ్రహ్మోత్సవం, అత్తారింటికి దారేది, మిర్చి, ఆహా, సన్ అఫ్ సత్యమూర్తి, బృందావనం, లక్ష్మి ఒకటేమిటి చెప్పుకుంటూ ఓ రెండు పేరాలకు సరిపడా కాపీ సరుకంతా గుర్తొస్తూనే ఉంటుంది.

ఇన్ని అతుకులబొంతగా ఉన్న వారసుడు ఏ ఒక్క సీన్లోనూ కొత్తగా అనిపించకపోవడమే స్పెషాలిటీ. క్లైమాక్స్ అయ్యాక తమన్ ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నాడో కానీ లేచి వెళ్లకుండా చివరిదాకా చూసినందుకు మనం కళ్ళు తుడుచుకుంటూ బయటికి రావాలి. అవే ఎక్స్ ప్రెషన్లు, రిపీట్ స్టెప్పులు, స్టయిల్ తో నెట్టుకొస్తున్న బాడీ లాంగ్వేజ్ వెరసి విజయ్ లుక్స్ పరంగా అందంగా ఉండటం తప్ప ఇంకేమి చేయలేదు. రానురాను మన దర్శకులు కార్పొరేట్ సంస్థల వ్యవహారాలను ఛాయ్ బండి లెవెల్ కి తీసుకుపోతున్నారు. డ్రామా కోసం మరీ సిల్లీగా రాసుకుంటున్నారు. పైగా ఏదో పెద్ద బడ్జెట్ అన్నారు కానీ పాటలకు వేసిన సెట్లు, ఫైట్లు తీసిన అవుట్ డోర్లు మినహాయించి మిగిలిన సినిమా మొత్తం అద్దెకు తీసుకున్న ఖరీదైన ఇంట్లో చుట్టేశారు. అరవ తంబీలు హిట్ చేయిస్తారేమో కానీ తెలుగు సోదరులు ఈ వారసుడుని మోయడం కష్టమే.