YSRCP-MP-Vijaya-Sai-Reddy-విజయసాయి రెడ్డి కేవలం వైసీపీ ఎంపీ మాత్రమే కాదు. సిఎం జగన్మోహన్ రెడ్డి తర్వాత రెండో స్థానంలో పార్టీలో చక్రం తిప్పుతున్న వ్యక్తి. ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర మంత్రులతో నిత్యం టచ్చులో ఉంటూ తమ అధినేత మీద, ప్రభుత్వం మీద ఈగ వాలకుండా మూడున్నరేళ్ళుగా చాలా జాగ్రత్తగా కాపాడుకొంటున్నారు. ఆయన ఇంతగా చక్రం తిప్పుతుంటే సొంతపార్టీలో నేతలే ఆయన కుర్చీ కింద మంట రాజేస్తున్నారు. ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జ్ పదవి నుంచి తప్పించడమే ఇందుకు నిదర్శనంగా కనబడుతోంది. కానీ విజయసాయి రెడ్డి విశాఖపై తన పట్టువదులుకోవడానికే ఇష్టపడటం లేదు. అందుకే ఆయన రాజధాని పేరుతో హడావుడి చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

మంగళవారం ఆయన హడావుడిగా విశాఖలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి, దసపల్లా భూములు, రామోజీ, ఈనాడు గురించి మాట్లాడుతూ పనిలో పనిగా తనకు ఎసరు పెట్టాలని ప్రయత్నిస్తున్న వైసీపీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ ప్రస్తావన కూడా చేయడం గమనార్హం.

విశాఖ నగరంలోని కూర్మన్నపాలెం వద్ద హయగ్రీవ వెంచర్‌లో డెవలపర్ 99 శాతం వాటా తీసుకొని భూమి యజమానికి కేవలం ఒక్క శాతం మాత్రమే ఇచ్చారని, ప్రపంచంలో ఎక్కడా ఈవిదంగా ఒప్పందం జరగలేదని, దీనిపై విచారణ జరపాల్సి ఉందని విజయసాయి రెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టులో ప్రధాన భాగస్వామి వైసీపీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ!

సొంత ఎంపీ భూయజమానిని మోసం చేశాడన్నట్లు విజయసాయి రెడ్డి మాట్లాడటం గమనిస్తే వారిరువురి మద్య విభేధాలున్నాయని, విశాఖలో విజయసాయి రెడ్డికి ఎంవివి సత్యనారాయణే ఎసరు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. ఈనాడుకు పోటీగా తాను కూడా ఓ మీడియాను ఏర్పాటు చేస్తానని రామోజీకి సవాలు విసిరినట్లుగానే విజయసాయి రెడ్డి పనిగట్టుకొని విశాఖకు వచ్చి ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ వైసీపీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ కూడా సున్నితంగా వార్నింగ్ ఇచ్చినట్లు భావించవచ్చు.