Vijay_Sai_Reddy_Taraka_Ratnaయువగళం పాదయాత్రలో పాల్గొన్నప్పుడు నందమూరి తారకరత్న గుండెపోటుతో కుప్పకూలిపోతే మంత్రులు రోజా, అంబటి రాంబాబు తదితరులు ఎంత అనుచితంగా మాట్లాడారో అందరికీ తెలుసు. తారకరత్నకి గుండెలో బ్లాకులు ఉన్నట్లు యాంజియో పరీక్షలో నిర్ధారణ అయితే, నారా లోకేష్‌ వల్లనే ఆయనకి ఆ దుస్థితి ఏర్పడిందంటూ అవాకులు చవాకులు మాట్లాడారు. తారకరత్నని ఓ మనిషిగా, ఓ నటుడిగా కాకుండా టిడిపితో ముడిపెట్టి చూస్తూ మాట్లాడటం చాలా దారుణం.

అయితే ఆ అత్యుత్సాహంలో వారు తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి తమ పార్టీకే చెందిన ఎంపీ విజయసాయి రెడ్డి మరదలి కూతురు అనే ఓ విషయం మరిచిపోయారు! బహుశః ఆ విషయం గుర్తుచేసిన తర్వాత వారి నోళ్ళు మూతపడ్డాయి. ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి మొక్కుబడిగా తారకరత్న త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నామని అన్నారు.

తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై వైసీపీ నేతలకి ఏ మాత్రం ఆసక్తి లేదనేది వాస్తవం. కానీ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి తారకరత్నతో బందుత్వం ఉన్న కారణంగా ఓ పక్క ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పటికీ నిన్న బెంగళూరు వెళ్ళి నారాయణ హృదయాలయ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న తారకరత్నని చూసి, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకొన్నారు.

తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, “తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు చాలా మెరుగ్గానే ఉంది. గుండెపోటు వచ్చినప్పుడు సుమారు 45 నిమిషాల సేపు మెదడుకి రక్త ప్రసరణ నిలిచిపోవడం మెదడు పైభాగం కొంత దెబ్బతిన్నప్పటికీ చికిత్సతో మళ్ళీ సరయ్యే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. ఇప్పుడు గుండెకి రక్తప్రసరణ బాగా జరుగుతోంది. శరీరంలో అన్ని అవయవాలు ఇప్పుడు బాగానే పనిచేస్తున్నాయి. తారకరత్నకి వైద్యులు మంచి చికిత్స అందిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ స్వయంగా దగ్గరుండి అన్నీ చూసుకొంటున్నారు. అందుకు ఆయనకి కృతజ్ఞతలు,” అని అన్నారు.