Vijay Sai Reddy says tdp-government-Anna-Canteen-corruption-తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన అన్నా క్యాంటీన్లు మూత పడ్డాయి. పేదలకు నామమాత్రపు ధరలకు కడుపు నింపే ఈ క్యాంటీన్లకు తాళాలు వేశారు. ప్రభుత్వానికి మూసి వేసే ఆలోచన లేదని, కొన్ని మార్పులు చేర్పులతో మళ్ళీ ఓపెన్ చేస్తామని మంత్రి బొత్సా సత్యనారాయణ చెప్పుకొచ్చారు. అయితే అన్నా క్యాంటీన్ల మూసివేతపై ప్రభుత్వానికి స్పష్టమైన వ్యూహం ఉంది. టీడీపీ మార్కు ఉన్న ఈ పథకాన్ని కంటిన్యూ చేస్తే లాభం లేదని ప్రభుత్వ ఉద్దేశం.

పైగా ఇప్పటికిప్పుడు వీటిని నడపడానికి ప్రభుత్వం వద్ద సొమ్ము లేదు. కొంత కాలం మూసివేసి, అవినీతి మకిలి అంటించి ప్రజల దృష్టి నుండి వీటిని పూర్తిగా చెరిపివేసి ఆ తరువాత రాజన్న క్యాంటీన్లగా ప్రవేశపెట్టాలని ప్రభుత్వ వ్యూహం. దీనికి అనుగుణంగా ఈ పథకంలో 150 కోట్ల స్కామ్ జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఎన్నికల ముందు ప్రజలను ప్రలోభ పెట్టాలని చంద్రబాబు యత్నించారని,అందులో భాగమే ఈ క్యాంటిన్లు అని ఆయన అన్నారు.

రెండు లక్షలతో నిర్మించే క్యాంటీన్‌కు రూ. 30-50 లక్షలు ఖర్చయిందని లెక్కలు చూపారని ఆయన అన్నారు. ఒకవేళ విజయసాయి రెడ్డి ఆరోపించింది నిజమే అనుకున్నా… క్యాంటీన్ల నిర్మాణంపై ఆరోపణలు ఉన్నా వాటిలో అందించే భోజనంపై ఎవరికీ ఎటువంటి అభ్యంతరాలు లేవు. అవినీతి పై విచారణ పిలిచి పథకాన్ని ముందుకు నడిపించవచ్చు. దీన్నిబట్టే అన్నా క్యాంటీన్ల మూసివేత విషయంలో పైకి చెబుతున్న కారణాల కంటే వేరేవి ఉన్నాయని స్పష్టం అవుతుంది