Vijay Sai Reddy Over Enthusiasm brought troubleఓ చిన్న ట్వీట్ నిప్పు రాజేసింది, అదికాస్తా అధికార పార్టీకి అంటుకుంది. విషయంలోకి వెళ్తే, ఈరోజు తెదేపా జాతీయ కార్యదర్శి “విజయసాయి ‘రెడ్డి’, సుబ్బా’రెడ్డి’, పెద్ది’రెడ్డి’, సజ్జల రామకృష్ణా ‘రెడ్డి’ ఎప్పుడు బిసిలుగా మారారు? వీరికి న్యాయం జరిగితే బిసిలకు న్యాయం జరిగినట్టేనా? అంతా జగన్ ‘రెడ్డి’ మాయ!” అంటూ ఓ ట్వీట్ వేసారు. అది అధికార పార్టీలో అగ్రనాయకులుగా, ఆ పార్టీ అదినాయకుడు జగన్ రెడ్డి కోటరీగా ముద్రపడిన నాయకులను, గత మూడేళ్ళగా వారిపై వస్తున్న అవనీతి, అధికార దుర్వినియెూగం వంటి ఆరోపణలను దృష్టిలో ఉంచుకుని వారు బాగుపడితే బిసిలు బాగుపడినట్టా అనే విదంగా వారిని ప్రశ్నిస్తూ పెట్టిన ట్వీట్ ఇది. దానికి సమాధానంగా అధికార పార్టీ నాయకుడు, యంపీ విజయసాయి రెడ్డి కులాలను సూచిస్తూ మేము బిసి, దళిత, మైనారిటీలకు సేవకులం అంటూ పెట్టిన ఒక ట్వీట్ సోషల్ మీడియా వేదికల్లో చర్చలకు దారితీసింది. ప్రతిపక్ష పార్టీ అభిమానులు, ముఖ్యంగా బిసి యువత ఆయన ట్వీట్ పై మండిపడుతూ ఈ మూడు సంవత్సరాలలో బిసి నుండి జరిగిన విషయాలను గుర్తు చేస్తూ కామెంట్లు, పోస్టులు పెడుతున్నారు.

ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన సంఘటనలు తరిచి చూస్తే, వివిధ లాభదాయక నామినేటెడ్ పోస్టుల్లో వెయ్యకు పైగా రెడ్డి వర్గానికే కట్టబెట్టారు, గత ప్రభుత్వంలో బిసిలు నిర్వహించిన అనేక ముఖ్యపోస్టుల్లో రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తులను నియమించింది. ప్రతిష్టాత్మక టిటిడి చైర్మన్, తుడా చైర్మన్ మెుదలు, యూనివర్సిటీ విసిలుగా, రిజిస్ట్రార్లగా నుంచి, యంయల్ఏల వద్ద పిఏ వంటి చిన్న ఉద్యోగాల్లో కూడా వారినే నియమించింది. జిల్లాల విభజన తరువాత చిత్తూరులో ఐతే ఉన్న ఇద్దరు మంత్రులతో కలిపి 18 ముఖ్యమైన పదవులు రెడ్డి వర్గానికి ఇచ్చారు. ఇంక బిసిలు అదికంగా ఉండే ఉత్తరాంధ్రలో వివిధ ప్రాంతాల నుండి రెడ్డి వర్గం ప్రముఖులు భారీగా భూములు, ఆస్తులు చేజిక్కించుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అలాగే బిసి వర్గానికి చెందిన చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఓ సభలో సుబ్బారెడ్డి కాళ్లకు నమస్కరించడాన్ని ఆయన కులానికి చెందిన సంఘాలే తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇక బిసి కులాలను కార్పొరేషన్ల పేరుతో నిధులు, విధులు లేని పదవులు ఇవ్వడం, స్ధానిక సంస్థల ఎన్నికల్లో ఒక రెడ్డి సంఘ నాయకుడు బిసిలకు రిజర్వేషన్ల మీద కోర్టులో కేసుకు వెళ్లడం వంటి అనేక సంఘటనలు జరిగాయి.

ఇంక వైసిపికి మెుదటి నుండి నిస్వార్థంగా మద్దతునిచ్చిన దళితుల మీద జరిగిన దాడులకు అంతేలేదు. ఒక మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుదాకర్ ను వేదించి, వెంటాడి ఆయన చావుకు కారణమైన విధానం ఆ పార్టీ ఉన్నంత వరకు మాయని మచ్చ. ఆపై ఒకదాని తర్వాత ఒకటిగా తూర్పు గోదావరిలో ఒక దళిత యువకుడు ఇసుక అక్రరమ వాణా గురించి ప్రశ్నిస్తే గుండు చేయించి దానిపై రాష్ట్రపతి లేఖ రాసినా స్పందిచకపోవడం, మాస్క్ పెట్టుకోలేదని ఒక దళిత యువకుడిని ఠాణాకు తీసుకువెళితే అతను లాకప్లో చనిపోవడం, చిత్తూరులో ఒక దళిత యువకుడు నాసిరకం మద్యంపై ప్రశ్నిస్తే అతన్ని చంపడం, అలాగే ఒక యంయల్సీ దళిత వర్గానికి చెందిన తన డ్రైవర్ ని హత్య చేసి డోర్ డెలివరీ చేయడం, దళిత ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారిని మరో మంత్రి పెద్దిరెడ్డి ఒక సభలో అవమానించే విదంగా మాట్లాడటం, మాజీ దళిత జడ్జి రామకృష్ణ గారిని, ఆయన కుటుంబాన్ని తీవ్ర ఇబ్బందులు పెట్టడం, అనేక మంది దళిత బాలికలు, మహిళలు అత్యాచారానికి గురవ్వడం వంటి అనేక సంఘటనలు జరిగాయి.

మైనారిటీల విషయంలో కూడా ఒక కుటుంబాన్ని బెదిరిస్తే ఆ కుటుంబం ఆత్మహత్య తేసుకోవడం, కడప, కర్నూలులో దళితుల భూములు ఆక్రమణల వంటి సంఘటనలు జరిగాయి.

ఇప్పుడు సాయి రెడ్డి గారు బిసి, దళిత, మైనారిటీలకు సేవకులం అంటూ పెట్టిన ట్వీట్ తో ఈ విషయాలన్నీ తవ్వి పోస్టులు పెడుతున్నారు, ఇదేనా మీరు బిసి, దళిత, మైనారిటీలకు చేసిన సేవ అంటూ ప్రశ్నిస్తున్నారు. లోకేష్ గారి ట్వీట్ అక్కడితో వదిలేస్తే ఎవరూ పెద్ద పట్టించుకునే వారు కాదేమెూ, కానీ సాయి రెడ్డి గారి ప్రతిస్పందనతో అధికార పార్టీ వల్ల ఆయా వర్గాలకు జరిగిన నష్టాలను ప్రతిపక్ష పార్టీ అభిమానులు ఏకరువు పెట్టడంతో వైసిపి అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. సాయి రెడ్డి గారి ట్వీట్ కు మద్దతుగా కూడా పెద్దగా అధికార పార్టీ మద్దతుదారులు మాట్లాడం లేదు. ఈమద్య పార్టీ ఆయనను పట్టించుకోవడం తగ్గిస్తున్నందున ఆయన పార్టీకి ఈ విదంగా ఇబ్బందులు పెడుతున్నారా అని చర్చించుకోవడం కొసమెరుపు.

– శ్రీకాంత్. సి