Vijay Malya Challenges Indiaమన దేశంలోని బ్యాంకులకు శఠగోపం పెట్టి, లండన్ కు పారిపోయిన లిక్కర్ బ్యారన్ విజయ్ మాల్యా రాజభోగాలు అనుభవిస్తున్నారు. నివసిస్తున్న దేశం మాత్రమే మారింది… ఆయన రాజసం మాత్రం ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకుంటున్నారు. బ్రిటన్ వెళ్లిన తర్వాత తొలిసారి ఆయన బహిరంగంగా కనిపించిన మాల్యా, బ్రిటన్ లో ఫార్ములా వన్ రేసుకు సంబంధించిన కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ రేసులో మాల్యాకు చెందిన ‘సహారా ఫోర్స్ వన్’ కూడా పాల్గొంటోంది. ఈ సందర్భంగా తన ఫార్ములా వన్ డ్రైవర్లు సెర్జియో పెరెజ్, ఈస్టెబాన్ లతో కలసి దర్జాగా ఫొటోలకు పోజులిచ్చారు. ఈ ఫొటోలను ఫార్ములా వన్ తన వెబ్ సైట్ లో పెట్టింది. బ్యాంకుల వద్ద భారీగా రుణాలు తీసుకుని, 9 వేల కోట్లకు ఎగనామం పెట్టిన లిక్కర్ బ్యారన్ విజయ్ మాల్యా బ్రిటన్ లో ప్రస్తుత పరిస్థితి ఇది.

ఇక, భారత్ కు రప్పించేందుకు మన అధికారులు విశ్వ ప్రయత్నం చేస్తుంటే… మాల్యా మాత్రం తనను ఇండియాకు రప్పించలేరంటూ ధీమా వ్యక్తం చేశారు. బ్రిటన్ చట్టాల కింద తాను అత్యంత సురక్షితంగా ఉన్నానని, బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల్లో ఒక్క రూపాయిని కూడా తాను దుర్వినియోగం చేయలేదని, తనపై నమోదు చేసిన కేసులను కొట్టిపారేశారు. భారత్ లోని రెండు అతి పెద్ద పార్టీలు తనను ఫుట్ బాల్ లా ఆడుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

మాల్యాకు సాయం చేశారంటూ ఒకరిపై మరొకరు నిందలు వేసుకుంటూ, ఎన్నికల ప్రచారం నిర్వహించుకుంటున్నారని, వాస్తవానికి తనది సివిల్ కేసు అని… కానీ, ప్రభుత్వ ఉత్తర్వులతో దాన్ని క్రిమినల్ కేసుగా మార్చారని ఆరోపించారు. ప్రతి విషయాన్ని సవాల్ చేసే అవకాశం తనకు ఉందని, ఫార్ములా వన్ కారు రేసులో మన దేశం ప్రాతినిధ్యం వహిస్తుంటే పొగడాల్సింది పోయి… దాన్ని కూడా రాద్ధాంతం చేస్తోందని మీడియాపై మండిపడ్డారు.