Vijay-Deverakonda-Clarifies--Remuneration-Hike-Reportsఇతర భాషల్లో సినిమాలు చేయడానికి తెలుగు హీరోలు పెద్దగా ఆసక్తి చూపించరు, ఒకవేళ చేసినా పబ్లిసిటీలు చేయడంలో ఘోరంగా విఫలమవుతుంటారు. ముఖ్యంగా తమిళ హీరోలు తెలుగులో మంచి మార్కెట్ పొందిన దరిమిలా, తెలుగు హీరోలు మాత్రం కోలీవుడ్ లో అస్సలు దృష్టి కేంద్రీకరించడం లేదన్న విమర్శ ఎప్పటినుండో వినపడుతోంది.

రెండు భాషల్లో తెరకెక్కిన “స్పైడర్” విషయంలో మహేష్ బాబు కూడా ఇదే తప్పు చేసారు. ఒక అగ్ర హీరోగా, అలాగే తమిళనాట మంచి ఫ్యాన్ బేస్ ఉన్న హీరోగా… తమిళంలో సరైన ప్రమోషన్ ను ఇవ్వలేకపోయారు. తమిళంలో ఓ ఇంటర్వ్యూతో సరిపెట్టిన ప్రిన్స్, నాడు చేసిన తప్పును ప్రస్తుతం విజయ్ దేవరకొండ సవరించుకుంటున్నాడు.

అక్టోబర్ 5వ తేదీన తెలుగు, తమిళ భాషల్లో విడుదలకు సిద్ధమైన “నోటా”కు తమిళనాట తగినంత పబ్లిసిటీ ఇచ్చే విధంగా ‘బిగ్ బాస్’లో అడుగు పెట్టాడు విజయ్. ‘అర్జున్ రెడ్డి’తో వచ్చిన క్రేజ్ మరియు ‘గీత గోవిందం’తో కూడా మంచి మార్కెట్ ఏర్పాటు చేసుకున్న విజయ్, అందుకు తగినట్లుగా పబ్లిసిటీ విషయంలో దృష్టి కేంద్రీకరించడం చెప్పుకోదగ్గ విషయం.

ఇటీవల ఓ కార్యక్రమంలో కూడా పాల్గొని, తమిళంలో మాట్లాడి స్థానిక ప్రేక్షకులను ఆకర్షించిన విజయ్, అదే ఊపులో కమల్ హోస్ట్ చేస్తోన్న “బిగ్ బాస్” హౌస్ లోకి ప్రవేశించాడు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రోమో కూడా విడుదలైంది. చక్కని చుక్కల నడుమ మన ‘అర్జున్ రెడ్డి’ వెలిగిపోతున్నాడు.