Vijay Deverakonda NOTAనేడు రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయం వేడెక్కింది. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా, అందుకు ప్రధాన ప్రతిపక్షం వైసీపీ దూరంగా ఉండడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. దీంతో అసెంబ్లీలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపినే ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందన్న వార్తలతో అసెంబ్లీ సమావేశాలు హాట్ టాపిక్ అయ్యాయి. ఇక దేశమంతా ప్రస్తుతం తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ వైపుకు చూస్తున్నాయి.

నిజానికి నేటి ఉదయమే రద్దుకు ప్రతిపాదనలు సిద్ధమవుతాయని భావించగా, అందుకు విరుద్ధంగా మధ్యాహ్నం నాటికి తెలంగాణా క్యాబినెట్ ను కేసీఆర్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట – రెండు గంటల ప్రాంతంలో క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి అసెంబ్లీ రద్దు ప్రకటన చేయనున్నారనే పక్కా సమాచారం లభించింది. దీంతో మధ్యాహ్న సమయం నుండి మీడియాలన్నీ కేసీఆర్ పైనే ఫోకస్ చేయనున్నాయి.

ఈ హడావుడి ఈ రోజంతా ఉంటుంది. తదుపరి కేసీఆర్ ఏం చేయబోతున్నారు? చట్టపరంగా ఎలా జరగనుంది? ప్రతిపక్ష పార్టీలు ఎలా ముందుకెల్తాయి? ఇలా తదితర కీలక అంశాలపై చర్చలు, విశ్లేషణలు జోరుగా సాగుతాయి. ఈ సమయంలో ఈ రోజు సాయంత్రం విజయ్ దేవరకొండ “నోటా” సినిమాకు సంబంధించిన ధియేటిరికల్ ట్రైలర్ విడుదల కాబోతోంది. రాజకీయం రంజుగా సాగుతున్న వేళ ‘నోటా’కు తగినంత పబ్లిసిటీ దక్కుతుందా? అన్నది వేచిచూడాలి.

విశేషం ఏమిటంటే… ఈ ‘నోటా’ కూడా రాజకీయ నేపధ్యంలో సాగే కధే. ‘గీత గోవిందం’ సినిమాతో టాలీవుడ్ ను షేక్ చేసిన విజయ్ దేవరకొండ, అనూహ్య రీతిలో ‘నోటా’ను తెరపైకి తీసుకురావడం, మరో నెల రోజుల్లోనే విడుదల చేస్తుండడం… అంతా కేసీఆర్ ముందస్తు ఎన్నికల ప్రచారంలా జరిగిపోయింది. బహుశా అందుకేనేమో… విజయ్ “నోటా” ట్రైలర్ పబ్లిసిటీకి ఒక రకంగా కేసీఆరే అడ్డుగా మారుతున్నారు.