vijay deverakonda met mahesh babu on the sets of Maharshi టాలీవుడ్ లో కొత్తగా వెలసిన ‘సూపర్ పవర్ స్టార్’ విజయ్ దేవరకొండ, “మహర్షి” సెట్స్ లో ప్రిన్స్ మహేష్ బాబు, దర్శకుడు వంశీ పైడిపల్లిని కలిసి సదరు ఫోటోలను సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. విజయ్ పోస్ట్ చేసిన కొద్దిసేపటికే ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. అయితే ఈ ఫోటోలకు సంబంధించి ప్రిన్స్ అభిమానులు చేస్తోన్న వాదన సిల్లీగా ఉండడం విశేషం.

ఇటీవల ‘గీత గోవిందం’ సినిమా సక్సెస్ మీట్ కు చిరంజీవి హాజరైన విషయాన్ని ఉదహరిస్తూ… విజయ్ దేవరకొండను కలవడానికి చిరంజీవి వెళ్ళాడని, కానీ మహేష్ ను కలవడానికి అదే విజయ్ దేవరకొండ వచ్చాడని తమ అనుభూతులను పంచుకుంటున్నారు. ప్రస్తుత తరంలో అభిమానుల ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో అన్న దానికి నిదర్శనంగా ఈ ట్వీట్లను పేర్కొనవచ్చు.

రాజకీయాలలో చిరు ‘జీరో’ అయినా, సినీ ఇండస్ట్రీలో ఎప్పుడూ ‘హీరో’నేని ‘ఖైదీ నంబర్ 150’ సాధించిన కలెక్షన్సే చెప్పకనే చెప్పాయి. అయినా చిరు స్థాయి కలెక్షన్స్ కు అతీతం. అలాంటి చిరంజీవిని మహేష్ తో పోల్చడం, మహేష్ ను విజయ్ దేవరకొండతో పోల్చడం అనేది…. పరిపక్వతలేమీని సూచిస్తుందే తప్ప, తమ అభిమాన హీరో గొప్పతనాన్ని పెంచదు అన్న విషయాన్ని గుర్తించాలి.

గతంలో ఇలాంటి వాటికీ ప్రిన్స్ అభిమానులు కాస్త దూరంగానే ఉండేవారు. బహుశా పవర్ స్టార్ ఫ్యాన్స్ నుండి స్ఫూర్తి పొందారో ఏమో గానీ, ఇలాంటి అనాలోచిత ట్వీట్లను ఇటీవల ఎక్కువగానే చేస్తున్నారు. ఓ పక్కన మహేష్ అందరి హీరోలతో కలిసిపోతూ ఫోటోలకు ఫోజులు ఇస్తుంటే, మరో పక్కన అభిమానులు ఇలా వేరుచూసి వ్యాఖ్యలు చేసుకోవడం ఎంతవరకు సబబో వారే ఆలోచించుకోవాలి.