Vijay Deverakonda has to learn lessonపరిశ్రమలో ఏ హీరో స్థాయినైనా కొలిచేది సక్సెస్ తోనే. అది కొనసాగినంత కాలం మనం చెప్పిందే మాట ఆడిందే ఆట. ఒక్కసారి ఫెయిల్యూర్ వైరస్ అంటుకుందా మన వెంటే ఉన్నారని ఫీలయిన అభిమానులు సైతం దూరమయ్యే ప్రమాదం ఉంటుంది. ఇండస్ట్రీ తీరే కాదు జనాల ధోరణే అంత. అందుకే విజయం హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా కొందరు మాత్రమే శిఖరాగ్రాలకు చేరుకుంటారు. అలాంటి అవకాశం అదృష్టలక్ష్మి అందరికీ ఇవ్వదు. దాన్ని సరిగా వాడుకుని గెలిచిన వాణ్ణే విజేత అంటారు. ఈ కొలతలో ఏ మాత్రం తేడా జరిగినా విక్టరీ నడుచుకుంటూ వస్తే ఓటమి మెట్రో ట్రైన్ లో వచ్చేస్తుంది

విజయ్ దేవరకొండ కెరీర్ ఇప్పుడు స్వీయ విశ్లేషణలో పడింది. తండ్రి ఒకప్పడు సీరియల్ డైరెక్టర్. పెద్దగా సక్సెస్ లు లేక వెనక్కు వచ్చారు. కానీ ఓడిన చోట గెలవాలనే పట్టు విజయ్ ది. అందుకే రవిబాబు ‘నువ్విలా’లో క్రికెటర్ గా అతి చిన్న వేషం వేసినా, శేఖర్ కమ్ముల ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’లో పెద్దగా ప్రాధాన్యం లేకపోయినా పట్టించుకోలేదు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’లో రిషి పాత్ర బ్రేక్ ఇచ్చే దాకా ఎదురుచూశాడు. అది కూడా ఓవర్ నైట్ స్టార్ ని చేయలేదు. కాకపోతే తనలో నటుడిని టాలెంటెడ్ డైరెక్టర్స్ గుర్తించేలా చేసింది. అప్పుడు దర్శకుడు తరుణ్ భాస్కర్ రూపంలో తలుపు తట్టిన బంగారం లాంటి ఆఫరే ‘పెళ్లి చూపులు’.

ప్లెజెంట్ కంటెంట్ తో పక్కింటి కుర్రాడిలా అనిపించినా విజయ్ దేవరకొండను ఆడియన్స్ పాస్ చేశారు. ఎప్పుడో ఒప్పుకున్న ‘ద్వారకా’ దెబ్బేసినా ‘అర్జున్ రెడ్డి’ రూపంలో ఒక యూత్ ఐకాన్ గా తెరకు కొత్తగా పరిచయమయ్యాడు. అగ్రెసివ్ హీరోయిజంకు కొత్త అడ్రెస్ దొరికింది. ఇమేజ్ లేని హీరో సినిమాకు ముందు రోజు ప్రీమియర్లు వేస్తే చిన్న సెంటర్లలోనూ హౌస్ ఫుల్స్ పడటం దానికొచ్చిన క్రేజ్ కి నిదర్శనం. ఇక ‘గీత గోవిందం’ రూపంలో ఫ్యామిలీ ఆడియన్స్ కి మరింత దగ్గరయ్యాడు విజయ్. దాని బ్లాక్ బస్టర్ వసూళ్లను అంత అనుభవమున్న అల్లు అరవింద్ సైతం గెస్ చేయలేకపోయారు

ఇదంతా టైం పీక్స్ లో ఉన్నప్పుడు జరిగిన సానుకూలతలు. జనం మెచ్చుకున్నారు కదాని తమిళంలో కూడా ఎగబడి చూస్తారనే తప్పుడు లెక్కతో ఆరవ దర్శకుడితో చేసిన ‘నోటా’ మొదటి పాఠం నేర్పింది. ‘టాక్సీవాలా’ హిట్టే కానీ అప్పటికే పెరిగిన మార్కెట్ స్థాయిలో కలెక్షన్లు తేలేదు. అయినా అది బుర్రకు ఎక్కలేదు. ‘డియర్ కామ్రేడ్’ ప్రమోషన్లలో ఇతని కాన్ఫిడెన్స్ చూసి మీడియా సైతం ఆశ్చర్యపోయింది. కానీ రిజల్ట్ మళ్ళీ రిపీట్ అయ్యింది. పబ్లిక్ నో అన్నారు. అతివాద ప్రేమికుడిగానే తనను చూస్తారన్న మరో భ్రమలో ‘వరల్డ్ ఫేమస్ లవర్’గా వచ్చిన విజయ్ కి మరోసారి తిరస్కారం తప్పలేదు.

ఇక ఇప్పుడు ‘లైగర్’ విషాద గాథలు చూస్తున్నాం. కంటెంట్ ని స్క్రిప్ట్ ని చెక్ చేసుకోకుండా మితిమీరిన స్వీయ అంచనాలతో వాట్ లాగా దేంగే అంటూ దేశంమొత్తం వెళ్లిన ప్రతి చోట గొంతు అరిగిపోయేలా అరిచిన విజయ్ కు ఆ ఫలితం కనీసం మొదటి రోజు ఈవెనింగ్ షో దాకా కాపాడలేకపోయింది. దీని తాలూకు నష్టాలు దర్శకుడు పూరి జగన్నాధ్ డిస్ట్రిబ్యూటర్ల మధ్య చిచ్చు పెట్టి ఏకంగా పోలీస్ కంప్లయింట్ దాకా తీసుకెళ్లాయి. ఆర్థిక వ్యవహారాలతో విజయ్ కు సంబంధం లేకపోయినా బజ్ ని ఇష్టారీతి పెంచడంలో తన వంతు పాత్ర పోషించి ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాడుగా.

ఎక్కడ నెగ్గాలో కాదురా ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే స్టార్ అనేది ఇక్కడ అన్వయించుకోవలసిన డైలాగ్. విజయ్ దేవరకొండకు తగ్గడం ఇష్టం లేదు. కానీ ప్రేక్షకులు తగ్గి తీరాల్సిందేనని నేలకు దించేశారు. స్టార్ డం గురించి కట్టుకున్న గాలిమేడలను కూల్చేశారు. చిరంజీవి, రజనీకాంత్,అమితాబ్ లాంటి వాళ్ళు కేవలం సినిమాల ద్వారానే అంత ఫాలోయింగ్ తెచ్చుకోలేదు. వాళ్ళ నడవడిక వ్యక్తిత్వం, కథల ఎంపికలో తీసుకునే అపారమైన శ్రద్ధ యువకులుగా ఉన్నప్పుడు సూపర్ హిట్స్ ని తెచ్చిపెట్టింది. అలా కాకుండా నేను ఏం చేస్తే అది రైట్ అని చెప్పడానికి ఇది ఇడియట్ సినిమా కాదుగా రియల్ లైఫ్.

ఇలాంటి ఉచ్ఛదశను గతంలో చూసినవాళ్లు ఉన్నారు. నువ్వే కావాలి దెబ్బకు తరుణ్ ఒకే రోజులో యూత్ ఫెవరెట్ అయ్యాడు. నువ్వు నేను చూశాక నిర్మాతలు ఖాళీ చెక్కులతో ఉదయ్ కిరణ్ ఇంటికి క్యూ కట్టారు. బలమైన బ్యాకప్ ఉన్న సుమంత్ ఎందుకు నిలదొక్కుకోలేదు. చిరంజీవి తమ్ముడి బ్రాండ్ పవన్ కళ్యాణ్ వాడుకున్నాడు కానీ నాగబాబుకి ఎలాటి ప్రయోజనం కలిగించలేదు. సో ఇక్కడ కష్టపడే వాడికి దానికి విలువిచ్చి నిలబెట్టుకునే వాడికే జీవితాంతం స్టార్ డం ఉంటుంది. అంతే తప్ప యాటిట్యూడ్ పేరుతో ఏది చేసినా చెల్లుతుందనుకుంటే దానికేదో రోజు బ్రేకులు పడతాయి. రౌడీ హీరో జాగ్రత్త పడాల్సింది ఇక్కడే. ఈ మలుపు దగ్గరే…..