Vijay Devarakonda Over Confidence on Arjun Reddy“నేను నటించిన సినిమా పైన నాక్కూడా నమ్మకం లేకపోతే ఎలా? ఒకవేళ అదే జరిగితే అంతకన్నా దౌర్భాగ్యం మరొకటి ఉండదు” – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ‘అర్జున్ రెడ్డి’ హీరో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్య ఇది. నిజమే… ఈ వ్యాఖ్యలు అక్షర సత్యం. కానీ ఇక్కడే విజయ్ ఓ చిన్న లాజిక్ కూడా మరిచినట్లుగా ఉన్నారు. ‘విశ్వాసం’ ఉండడం ఎంత అవసరమో, ‘అతి’ విశ్వాసం ప్రదర్శించడం అంత అనర్ధం కూడా! యువరక్తం కదా… ఇది అర్ధం చేసుకోవడానికి కొంత సమయం పడుతుందిలేండి!

అది ఎంత సమయం అని మాత్రం అడగకండి… ఎందుకంటే మన ప్రేక్షకులు తలచుకుంటే, ‘అర్జున్ రెడ్డి’ విడుదల కాబోతున్న ఈ శుక్రవారం నాటికైనా జరగవచ్చు లేదా ఇంకాస్త టైం పట్టవచ్చు. ఎందుకంటే… గతంలో ఇలా కాస్త అతిగా రెస్పాండ్ అయిన (చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా) హీరోలకు తెలిసివచ్చేలా ప్రేక్షకులు తీర్పు ఇచ్చిన సందర్భాలు కోకొల్లలు. అయితే ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న విజయ్ కెరీర్ లో అలా జరగకూడదని కోరుకుందాం గానీ, ఈ యువహీరో కాస్త ఎక్కువ చేసాడన్న విషయాన్ని ఈ వేడుకకు హాజరైన సీనియర్ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సున్నితంగా మందలించారు కూడా!

‘పెళ్లిచూపులు’ సినిమాకు ముందు వరకు పెద్దగా తెలియని విజయ్, ఆ సినిమా సక్సెస్ తో మంచి కీర్తి ప్రతిష్టలు సొంతం చేసుకున్నాడు. మధ్యలో ‘ద్వారకా’ అనే సినిమా వచ్చివెళ్ళిన విషయం చాలామంది ప్రేక్షకులకు తెలియని కూడా తెలియదు. కేవలం ఒకే ఒక్క హిట్ ను బ్యాక్ గ్రౌండ్ లో ఉంచుకుని, విజయ్ ఈ విధంగా స్పందించడం బహుశా ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆహ్వనించరేమో! దీని పర్యవసానాలు ఏంటి అన్నది విజయ్ కు తెలియడానికి కొంత సమయం పట్టవచ్చు గానీ, ప్రస్తుతానికి మాత్రం ఈ వ్యాఖ్యల ద్వారా తాను ఏదైతే అనుకున్నాడో, దానినైతే తిరుగులేకుండా సాధించాడని చెప్పవచ్చు.

ఎందుకంటే… ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ “అర్జున్ రెడ్డి” సినిమా అయ్యింది. ఇటీవల కాలంలో ఏ చిన్న సినిమాపై కూడా లేనంత బజ్ ఈ సినిమాపై అటు ఇండస్ట్రీలోనూ, ఇటు ప్రేక్షకులలోనూ ఏర్పడింది అంటే… అది విజయ్ చేసిన వ్యాఖ్యల ప్రభావమే. ట్రైలర్ విడుదల సమయంలో విజయ్ చేసిన వ్యాఖ్యలు గానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలు గానీ, ‘ఎవరు ఏమైనా అనుకోనీయ్…’ అన్న రీతిలో మాట్లాడుతూ… “అర్జున్ రెడ్డి” అనే ఒక సినిమా ఉందని ప్రేక్షకులకు పరిచయం చేసాడు. దానికి తోడు విడుదలైన ట్రైలర్ ఆకట్టుకోవడంతో యువతలో మాంచి క్రేజ్ ఏర్పడింది. అయితే సినిమా సక్సెస్ అయితే విజయ్ వ్యాఖ్యలను ప్రేక్షకులు మరిచిపోయే ఆస్కారం ఉంది గానీ, అదే రివర్స్ అయితే మాత్రం అది విజయ్ కెరీర్ పైనే ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు.

ఈ సందర్భంగా వీహెచ్ కు విజయ్ చేసిన ‘చిల్ తాతయ్య’ అన్న వ్యాఖ్యలే, విజయ్ కు కూడా వర్తిస్తాయని చెప్పాలి. ఒకవేళ తాను అనుకున్నట్లు “అర్జున్ రెడ్డి” బ్లాక్ బస్టర్ విజయం సాధించినా, అదేమీ ‘బాహుబలి’ రికార్డులను కొట్టే సినిమా కాదు కదా! 1600 కోట్ల రెవిన్యూ అందుకున్న ‘బాహుబలి’ యూనిట్టే సైలెంట్ గా ఉన్న తరుణంలో… బాగా హిట్టయితే ఓ 30 కోట్లు వచ్చే సినిమాకు అంత ఆవేశం అవసరం లేదు… కాస్త రిలాక్స్ అవ్వు… చిల్ విజయ్… అని చెప్పకతప్పదు. ఆవేశం ఎక్కువైతే అది అనర్ధానికి దారి తీస్తుందన్న నానుడి విజయ్ కు తెలియనిది కాదేమో… ఒక్కసారి గుర్తు చేయడం ఉత్తమమే!