Bichagadu 2అనుకుంటాం కానీ ఒక్క బ్లాక్ బస్టర్ ఇచ్చే లైఫ్ ఏళ్ళ తరబడి ఉంటుంది. షోలే లేకపోతే రమేష్ సిప్పి అనే వ్యక్తి గురించి చరిత్ర ఎప్పుడో మర్చిపోయేది. దాని ఫలాలు ఆర్థికంగా ఇప్పటికీ వాళ్ళ కుటుంబం అందుకుంటూనే ఉంది. మూసేద్దాం అనుకున్న టైంలో రాజశ్రీ ప్రొడక్షన్స్ కు మైనే ప్యార్ కియా రూపంలో దక్కిన సక్సెస్ కోట్ల కనక వర్షం కురిపించింది. వరస ఫ్లాపులతో సతమతమవుతున్న టైంలో రామనాయుడు గారు తీసిన ప్రేమనగర్ తిరిగి వెనక్కు చూసుకోవాల్సిన అవసరం పడనివ్వలేదు. వీళ్ళందరూ తర్వాత కూడా హిట్లతో తమ విజయ యాత్రను కొనసాగించినవాళ్లే.

విజయ్ ఆంటోనీ మాత్రం దీనికి అతీతంగా సాగుతున్నాడు. 2016లో బిచ్చగాడు వచ్చింది. మొదటి రోజు జనం లేరు అనే టాక్ దగ్గరి నుంచి వంద రోజులు భారీ కలెక్షన్లతో నిర్మాతకు డబ్బుల వరద ముంచెత్తే రేంజ్ లో ఆడేసింది. యాభై లక్షలకు డబ్బింగ్ హక్కులు కొంటే పాతిక కోట్లకు పైగా వసూలు కావడం ఇప్పటికీ రికార్డు. మనం సాధారణంగా చులకనగా చూసే బిచ్చగాళ్ల పాత్రనే హీరోతో వేయించి దానికి తల్లి సెంటిమెంట్ ని జోడించిన తీరు ప్రేక్షకులను కట్టి పడేసింది. టీవీలో వచ్చిన ప్రతిసారి భారీ రేటింగ్స్ వచ్చాయి.ఇదంతా జరిగిపోయిన కథ.

తర్వాత ఇదే విజయ్ ఆంటోనీ చాలా సినిమాలతో వచ్చాడు. దాదాపు అన్నీ పోయాయి. కొన్ని పర్వాలేదనిపించుకున్నా కమర్షియల్ కోణంలో అన్నీ సోసోనే. తిరిగి 2023లో బిచ్చగాడు 2తో వస్తున్నాడు. ఇది కొనసాగింపు కాదు. పూర్తిగా వేరే కథ. ఈసారి చెల్లి ప్రేమను తీసుకుని డ్యూయల్ రోల్ తరహా ప్రయోగమేదో చేశాడు. ఇంత బ్యాడ్ ట్రాక్ రికార్డులోనూ సుమారు ఆరు కోట్లకు ఈ సినిమా థియేటర్ బిజినెస్ చేయడం చూస్తే మొదటి భాగం తాలూకు ప్రభావం ఇటు ట్రేడ్ లో అటు మాస్ జనంలో ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇలా జరగడం అరుదే కానీ ఇలా ఇంతేసి గ్యాప్ తో కేవలం బిచ్చగాడు పేరు చెప్పుకుని కెరీర్ మొత్తం సినిమాలు చేస్తూ పోలేరుగా. విజయ్ ఆంటోనీ మీద నటన పరంగా కామెంట్స్ ఉన్న మాట నిజమే. బేసిక్ ఎక్స్ ప్రెషన్లు తప్ప హెవీ ఎమోషన్లు పండించలేడని విమర్శకులు చెప్పే ప్రధానమైన కంప్లయింట్. వీటిని సరిచేసుకోవడం చేసుకోకపోవడం పక్కనపెడితే ఒకవేళ బిచ్చగాడు 2 కనక నిజంగా హిట్ అయితే ఈ బ్రాండ్ తో మాత్రమే తాను సక్సెస్ సాధించగలడని 3 కూడా రెడీ చేయొచ్చు. అన్నట్టు ఈసారి దర్శకత్వం తనే చేసుకున్న విజయ్ ఆంటోనీ మీద పెద్ద బరువే ఉంది.