Bichagadu 2ఒక బ్లాక్ బస్టర్ తాలూకు బ్రాండ్ ప్రభావం అంత సులభంగా అంచనా వేయలేం. అది కొన్నిసార్లు సంవత్సరాలు దాటి దశాబ్దాలు కూడా ఉంటుంది. ఎవర్ గ్రీన్ క్లాసిక్ మాయాబజార్ టైటిల్ ని 1995లో దాసరి నారాయణరావుగారు తిరిగి వాడితే కేవలం ఆ పేరు మీదే విపరీతమైన బిజినెస్ జరిగింది. క్యాస్టింగ్, కాంబినేషన్లు తర్వాత పని చేశాయి. షోలేని తిరిగి ఎవరూ పెట్టుకునే సాహసం చేయలేదు . ఏ మాత్రం తేడా వచ్చినా ప్రేక్షకుల దృష్టిలో చులకనవుతామని. అమితాబ్ బచ్చ డాన్ మార్కెట్ వేల్యూ గురించి కథలుగా చెప్పుకోవచ్చు.

ఇప్పుడీ ప్రస్తావనకు కారణం బిచ్చగాడు 2. తమిళంలో క్రిటిక్స్ ప్లస్ జనాలు బిలో యావరేజ్ అని తేల్చేశారు. వసూళ్లు కూడా మరీ అదిరిపోయేలా లేవు. విచిత్రంగా తెలుగులో మాత్రం మూడు రోజులకే పది కోట్ల గ్రాస్ వచ్చిందట. లెక్కల సంగతి పక్కనపెడితే తెలుగు పబ్లిక్ ఎక్కడా దీని గురించి విపరీతమైన పాజిటివిటీతో మాట్లాడిన దాఖలాలు లేవు. ఇది మైండ్ ఎక్కడన్నా స్టోర్ రూమ్ లో పెట్టి చూడాలనే జోకులే ఎక్కువ. సోషల్ మీడియాలో సాధారణంగా కనిపించే ఎలివేషన్ ట్వీట్లు కనిపిస్తే ఒట్టు. అపోజిషన్ వీక్ గా ఉన్న టైంలో విడుదల చేస్తే ఎంత గొప్పగా వర్కౌట్ అవుతుందో చెప్పడానికి ఈ సినిమానే ఉదాహరణ.

ఈ ఘనత పూర్తిగా మొదటి బిచ్చగాడు 1కి చెందుతుంది. రిలీజై ఇన్నేళ్లు దాటుతున్నా దాని మేనియా ఇంకా ప్రేక్షకుల్లో ఉంది. బలమైన తల్లి సెంటిమెంట్ తో పాటు అంతులేని సంపద ఎంతున్నా జీవితంలో దుర్భరం అనిపించే సమయం వస్తుందని అందులో చూపించిన తీరు సగటు మధ్యతరగతికి బాగా రీచ్ అయిపోయింది. ఇంకేముంది ముప్పై కోట్ల వసూళ్లను కురిపించేశారు.హక్కుల కోసం నిర్మాతకైన పెట్టుబడి ఖర్చు కేవలం యాభై లక్షలు. బిచ్చగాడు 2 ఇవాళ నెమ్మదించింది. మళ్ళీ వీకెండ్ వచ్చే దాకా ఇదే పరిస్థితి కొనసాగుతుంది.

విజయ్ ఆంటోనీ బిచ్చగాడు 3కి రెడీ అయ్యాడు. నిజానికి ఈ సిరీస్ బాహుబలి, కెజిఎఫ్ లాగా కొనసాగింపు కాదు. ఒకదానికొకటి సంబంధం లేని కథలు. ఫస్ట్ పార్ట్ లో సహజత్వానికి పెద్ద పీఠ వేసిన ఇతను రెండో భాగంలో లాజిక్స్ ఎమోషన్స్ తగ్గించి గ్రాండియర్ నెస్ పెంచాడు. మూడోదాంట్లో ఎక్కువ విజువల్ ఎఫెక్ట్స్ వాడినా ఆశ్చర్యం లేదు. ఇదొక రకంగా రిస్క్ చేయడమే. ఏదో ఇప్పుడు ఫ్లోలో ఆడేసిందని మార్కెట్ ని అర్థం చేసుకోకుండా త్రీ ఫోర్ అంటూ తీసుకుంటూ పోతే ఏదో ఒకనాడు ఆ బ్రాండ్ విలువ తగ్గిపోయే ప్రమాదం ఉంది.