Virat-Kohli-craze-indiaఏమని పొగడాలి… ఏమని వర్ణించాలి… ఈ విరాటుడి విజయం గురించి..! కొండంత లక్ష్యం ఆయన కళ్ళ ముందు ఉంటే ఆయన కాళ్ళు బుల్లెట్ రైళ్ళ మాదిరి పరిగెడతాయి. ఇక స్టీరింగ్ లాంటి చేతిలోని బ్యాట్ అయితే ఎలా తిరుగుతుందో, ఎటు తిరుగుతుందో బహుశా ఆయనకు మాత్రమే తెలుసు… అనే విధంగా యార్కర్ బంతులను కూడా బౌండరీలకు తరలించి భారత జట్టుకు మరోసారి ఒంటి చేత్తో విజయాన్ని అందించి సగర్వంగా సెమీస్ కు చేర్చాడు.

పిచ్ బ్యాటింగ్ కు సహకరించడం లేదు… బౌలర్లు అద్భుతమైన బంతులను వేస్తున్నారు… అందుకే ఈ మ్యాచ్ లో సరైన ప్రతిభ చూపలేకపోయాం… అన్న మాటలకు ఆస్కారం లేకుండా ప్రత్యర్ధి జట్టులో ప్రపంచ మేటి బౌలర్లు ఉన్నా… మరో వైపు తన సహచరులు పరుగులు చేయడానికి ఇబ్బందులు పడుతున్నా… మొక్కవోని దీక్షతో క్రీజులో పాతుకుని పోయి… ఇండియా విజయ తీరాలకు చేర్చిన ఘనుడు ఈ విరాటుడు.

కోహ్లి ప్రదర్శించిన బ్యాటింగ్ ప్రతిభకు యావత్తు ప్రపంచం ముగ్దులయ్యారు. ఒకానొక సమయంలో మ్యాచ్ చేజారిపోయిందని అనుకున్న భారత అభిమానులు కోహ్లి అమోఘమైన షాట్లకు సలాం చేసారు. కేవలం 51 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో అజేయమైన 82 పరుగులు చేసి, సెమీస్ లో తలపడబోయే వెస్టీండీస్ కు ఒక వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఈ అనూహ్యమైన విజయంతో ప్రపంచ కప్ గెలుస్తామో లేదో గానీ, విరాట్ కోహ్లి బ్యాటింగ్ కు ప్రపంచ కప్ కూడా చిన్నబోయిందేమో అన్న అనుభూతి సర్వత్రా వ్యక్తమవుతోంది.