Vice-Presidential Bjp poll venkaiahnaiduబీజేపీ పార్లమెంటరీ సమావేశంలో ఉప రాష్ట్రపతి అభ్యర్థిపై నిర్ణయం తీసుకోనున్న విషయం తెలిసిందే. అయితే ఎవరి పేరును బిజెపి అధిష్టానం ఖరారు చేసిందో ఇప్పటికే తెలిసిపోయింది. ఉప రాష్ట్రపతిగా ఉండడానికి తనకు ఇష్టం లేదని వెంకయ్య నాయుడు ఎంతగా చెప్పినా, చివరికి అదే పేరు బయటకు రానుందని మీడియా వర్గాలు ఘోషిస్తుండగా, వెంకయ్య సహచరులు ఇప్పటికే అభినందనల వెల్లువలు తెలియజేస్తున్నారు. అన్ని అనుకున్నట్లుగా నాయుడు పేరు ఖరారైతే జగన్ కు తిప్పలు తప్పవు అన్నది రాజకీయ విశ్లేషకుల మాట.

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, స్పీకర్ లాంటి అత్యున్నత పదవులను అధిరోహించే వ్యక్తిని పోటీ లేకుండానే ఎన్నుకోవాలని… అదే తమ అభిమతమని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బహిరంగంగా వెల్లడించిన విషయం తెలిసిందే. అందుకే తాము ప్రధాని నరేంద్ర మోడీని కలసి ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ప్రకటించామని నాడు సెలవిచ్చారు. ఇప్పుడు తాజాగా ఉపరాష్ట్రపతి పదవి కోసం ఎన్డీయే అభ్యర్థిగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు బయటకు వస్తే, జగన్ కు కొత్త తలనొప్పి ప్రారంభమైనట్లే.

మొట్టమొదటగా వెంకయ్య నాయుడుతో జగన్ కు ఏమాత్రం సత్సంబంధాలు లేవన్న విషయం బహిరంగమే. ఇంతకంటే ముఖ్యమైనది ఏమిటంటే… ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వెంకయ్య అత్యంత సన్నిహితంగా ఉండడం. ఇటీవల ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి కోవింద్ తో సమావేశం సందర్భంగా వెంకయ్య నాయుడు పక్కనే ఉండటం వలన జగన్ చాలా ఇబ్బంది పడినట్టు వార్తలు వచ్చాయి. అలాగే వెంకయ్యతో కలిసిన తన ఎమ్మెల్యేలపై కూడా కొంచెం సీరియస్ అయినట్టు కథనాలు వెలువడ్డాయి.

ఈ నేపథ్యంలో ఎన్డీయే అభ్యర్థిగా వెంకయ్య పేరు ఖరారైతే ఏం చేయాలో పాలుపోని పరిస్థితి జగన్ కు తలెత్తింది. విధిలేని పరిస్థితుల్లో వెంకయ్యకు మద్దతు ఇవ్వడమా? లేక తాను చెప్పిన మాటను తానే తప్పి, ప్లేటు ఫిరాయించడమా? దీనిపై స్పష్టత రావాలంటే కాస్త సమయం పట్టినప్పటికీ, ఉప రాష్ట్రపతి పేరు ప్రస్తుతం జగన్ కు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోందన్నది పొలిటికల్ సర్కిల్స్ లో హల్చల్ చేస్తున్న మాట. ఇప్పుడల్లా జగన్ కోరుకోవాల్సింది ఒక్కటే… ఉప రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు పేరు రాకుండా ఉండాలి అని..!