విశ్వహిందూ పరిషత్ మాజీ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా అనుచరుడు, ‘హిందూ హై ఆజ్’ ఆగ్రా నగర విభాగం అధ్యక్షుడు గోవింద్ పరాషర్ సంచలన ప్రకటన చేశారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ను కొట్టినవారికి 2 లక్షల బహుమతి ఇస్తానని ప్రకటించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా సల్మాన్ ‘లవరాత్రి’ పేరుతో సినిమా తీశారని, ఇది నవరాత్రి పండుగను అవమానించడమేనని ఆరోపించారు. సల్మాన్‌ను బహిరంగంగా కొట్టిన వారికి 2 లక్షలు బహుమానం ఇస్తామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆగ్రాలోని భగవాన్ టాకీస్‌లో ఈ సినిమా పోస్టర్లను దహనం చేసి, సల్మాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న ఈ సినిమాను నిషేధించాలని డిమాండ్ చేశారు. సెన్సార్ బోర్డు స్పందించి అనుమతి నిరాకరించాలని, లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని, సినిమా విడుదలైతే థియేటర్లను దహనం చేస్తామన్నారు. సల్మాన్ నటించిన ఈ సినిమా అక్టోబరులో విడుదలకు సిద్ధమవుతోంది.