Very less winning chances for Pawan Kalyan in Gajuwaka జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పోటీ చేసిన విశాఖలోని గాజువాక నియోజకవర్గంలో ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తం 3,09,326 ఓటర్లతో జిల్లాలోనే అతి పెద్ద నియోజకవర్గంగా ఉన్న గాజువాకలో టీడీపీ నుంచి పల్లా శ్రీనివాసరావు నుంచి తీవ్ర పోటీ ఎదురవుతుందని తొలుత ప్రచారం జరిగినా అనూహ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి బలమైన పోటీనిచ్చారు. వరుసగా రెండు సార్లు ఓడిపోయిన ఆయన పై సానుభూతి పని చేసిందని వార్తలు వస్తున్నాయి.

అదే సమయంలో వైకాపా వారు ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించి వ్యూహం ప్రకారం వెళ్లారు. గత అయిదు రోజులుగా భారీస్థాయిలో తాయిలాలు పంచారు. గురువారం పోలింగ్‌ సందర్భంగా చాలామంది పవన్‌ అభిమానులు పోలింగ్‌ బూత్‌లకు వచ్చినా.. ఈవీఎంలు మొరాయించడంతో కొందరు వెనక్కి వెళ్లిపోయారు. ఓటు వేయడానికి క్యూలైన్లలో గంటలపాటు నిరీక్షించాల్సిన పరిస్థితుల్లో చాలామంది అసహనంతో నిష్క్రమించారు. ఎండ కూడా తీవ్రంగా ఉండడంతో చాలామంది ఓటింగ్‌కు హాజరుకాలేదు.

అయితే గంగవరం, అగనంపూడి, కూర్మన్నపాలెం, దువ్వాడ, మింది, వడ్లపూడి తదితర ప్రాంతాల నుంచి తమకు భారీ సంఖ్యలో ఓట్లు వచ్చాయని అవే తమను గట్టెక్కిస్తాయని జనసైనికులు ధీమాగా చెబుతున్నారు. పోలింగ్ కు ముందు గాజువాకలో పవన్ కళ్యాణ్ ప్రచారం కూడా సరిగ్గా జరగలేదు. ముందు ఒక బహిరంగసభ రద్దు అయ్యింది. ఆ తరువాత వడదెబ్బ కారణంగా గాజువాకలో విస్తృత ప్రచారం చేసే అవకాశం దొరక్కపోవడం ఇబ్బందిగా మారాయి. టీడీపీ అభ్యర్థికూడా గెలుపు పట్ల దీమాగానే ఉన్నారు. మే 23వరకు ఫలితం కోసం వేచిచూడాల్సిందే.