venu-madhav-gossips-tv-channel-programఒకప్పుడు వెండితెరపై ఓ వెలుగు వెలిగిన వేణుమాధవ్, ప్రస్తుతం అరకొరగా కనిపిస్తున్న విషయం తెలిసిందే. అది కూడా కేవలం చిన్న సినిమాలకే పరిమితం కావడంతో, ప్రేక్షకులకు కాస్త దూరమైన మాట వాస్తవం. కానీ, ప్రేక్షకులకు తాత్కాలిక బ్రేక్ కాదు, ఏకంగా పర్మినెంట్ బ్రేక్ వచ్చేసిందని, ప్రముఖ మీడియా సంస్థ టీవీ 5 ప్రసారం చేసిన కధనాలను తీసుకువచ్చి, మీడియా ముందు ఆవేదన వెలిబుచ్చాడు వేణుమాధవ్.

నిజానికి గతంలో ఓ సారి ఇలాగే మీడియా ముందు తన బాధను వెళ్ళగక్కిన వేణుమాధవ్, తాజాగా మరోసారి మీడియా ముందుకు వచ్చారు. ‘తనపై ఎందుకు చేస్తున్నారో తెలియదు గానీ, కొన్ని మీడియా సంస్థలు మరియు వెబ్ మీడియా దుష్ప్రచారం చేస్తోందని, టీవీ 5 ప్రసారం చేసిన కధనాల పోస్టర్లను మీడియాకు చూపించారు. మరి అక్కడ చచ్చిపోతే, ఇక్కడ మాట్లాడుతున్నది ఎవరు? నిమ్స్ తానూ చివరిగా మాట్లాడానని ప్రసారం చేసిన దానికి ఛాలెంజ్ చేస్తున్నానని, అదే నిమ్స్ లో మీడియా ముందట బహిరంగంగా తనకు ఎలాంటి వైద్య పరీక్షలకైనా సిద్ధం అంటూ సవాల్ విసిరారు.

అయితే ఒక ప్రముఖ సెలబ్రిటీగా ఉన్న వేణుమాధవ్ ఇంతలా ఎందుకు స్పందించాల్సి వచ్చిందో కూడా చెప్పుకొచ్చారు. వేణుమాధవ్ మూడవ రోజు ఎప్పుడో చెప్పాలని రోజుకు కనీసం 500 నుండి 600 దాకా తన సన్నిహితుల నుండి ఫోన్స్ వస్తున్నాయని, నాకు గాక మా అమ్మ గారికి ఫోన్ కు కూడా కాల్స్ వస్తుంటే… బాధతో ఆమె ఆనారోగ్యం పాలైందని కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ బాధ పగోడికి కూడా రాకూడదని, బ్రతికి ఉన్న వ్యక్తిని ఎలా చంపేస్తారంటూ వేణుమాధవ్ పడిన వేదన వర్ణనాతీతం.

ప్రస్తుతం గవర్నర్ ను కలిసానని, అప్పాయింట్మెంట్ లభిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కూడా కలిసి ఒక వినతి పత్రం సమర్పిస్తానని, ఆలాగే హోం మంత్రిని కలిసి ఫిర్యాదు చేస్తానని అన్నారు. అయితే ఈ కుట్ర వెనుక ఎవరున్నారు? ఎందుకు చేస్తున్నారు? అన్న విషయాన్ని పోలీసులే చూసుకుంటారని, దాని గురించి నేనేమీ మాట్లాడను అంటూ సెలవు తీసుకున్నారు ఈ ‘నల్లబాలు.’ మీడియా సంస్థలు కనీస నైతిక బాధ్యతలు మరిచిపోవడం వలనే ఇలాంటి దుస్థితి తలెత్తిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో హీరో రామ్ సినిమా విషయంలోనూ వ్యతిరేక కధనాలు ప్రసారం చేసిన ఆ మీడియా సంస్థ పేరే, తాజాగా వేణుమాధవ్ విషయంలోనూ బయటకు రావడం విశేషం.