Vennela Kishore Top Filmsతెలుగు సిల్వర్ స్క్రీన్ పై కామెడీని పండించిన నటులు ఎందరో ఉన్నారు. రాజబాబు, రేలంగి దగ్గర నుండి బ్రహ్మానందం, ఎం.ఎస్.నారాయణ వరకు అనేక మంది తెలుగు తెరను ఏలగా… ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్లో ఉండడంతో, ఏ ఇండస్ట్రీలోనూ లేనంత మంది కమెడియన్లు మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో ఆ కామెడీకి కాస్త ‘వైరస్’ సోకినట్లయ్యింది. పంచ్ ల పేరుతో డబుల్ మీనింగ్ డైలాగ్స్, ఓవర్ యాక్షన్లు… ఇలా ఒకటేమిటిలే… కామెడీ పేరుతో సాగుతున్న పైత్యంకు అంతు లేకుండా పోతోంది.

ఇదిలా ఉంటే, మరో వైపు చక్కని టైమింగ్ తో హాస్యాన్ని పండించడం అనేది ‘వెన్నెల’ కిషోర్ సొంతమైంది. అప్పటివరకు ఒక స్థాయిలో ఉన్నటువంటి కిషోర్ ను ‘దూకుడు’ సినిమా మరో పది మెట్లు ఎక్కేలా చేసింది. దీంతో చిన్న, పెద్ద సినిమాలు అన్న తారతమ్యం లేకుండా, దాదాపుగా ప్రతి కీలక సినిమాలోనూ వెన్నెల కిషోర్ ఒక కీ రోల్ పోషిస్తున్నాడు. ఎలాంటి ఓవర్ యాక్షన్ లేకుండా, భారీ ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వకుండా, సింపుల్ గా డైలాగ్ చెప్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడం వెన్నెల కిషోర్ స్పెషాలిటీగా మారింది.

అయితే ఉన్నట్లుండి ఇంతలా ‘వెన్నెల’ కిషోర్ ఎందుకు హాట్ టాపిక్ గా అయ్యాడు అంటే… గత వారం విడుదలైన “కేశవ” సినిమాలోనూ, కొద్ది గంటల క్రితం సిల్వర్ స్క్రీన్ ను పలకరించిన “రారండోయ్ వేడుక చూద్దాం” సినిమాలలోనూ కిషోర్ పండించిన హాస్యం అద్భుతంగా ఉందని విమర్శకులు కితాబిస్తున్నారు. ముఖ్యంగా హాస్యం పండించే విధంగా డైలాగ్స్ టైమింగ్ విషయంలో కిషోర్ మాస్, క్లాస్ అన్న తేడా లేకుండా అన్ని వర్గాలను కేక పుట్టించడం ప్రధాన ప్లస్ పాయింట్ గా మారింది.

“మూడ్ దేముంది బ్రో… రెండు మూడేస్తే అదే సెట్టైపోద్ది…” అన్నా.., “నిన్ను పేరెంట్స్ గారంగా పెంచారనుకున్నా, చాలా ఘోరంగా పెంచారు” అంటూ పంచ్ వేసినా… “అతడు” సినిమా పొలం సీన్ కు స్పూఫ్ చేసినా… ప్రేక్షకులను నవ్వించడం కిషోర్ సొంతం. అలాగే బ్రేకప్ సాంగ్ లోనూ డ్యాన్స్ లు వేస్తూ తన హావభావాలతో ప్రేక్షకులకు కావల్సినంత కిక్ ఎక్కించాడు. విడుదలైన “కేశవ, రారండోయ్ వేడుక చూద్దాం” సినిమాలలో పరిస్థితి ఇలా ఉంటే… రాబోయే “అమీతుమీ, దువ్వాడ జగన్నాధం, ఆనందో బ్రహ్మా” సినిమాలలో కూడా కిషోర్ సూపర్ పాత్రలు పోషించడంతో… ముందుంది ఇంకా మంచికాలం అని చెప్పకతప్పదు.