Venky Mama shooting in Jammu and Kashmirసినిమా ప్లాన్నింగ్ విషయంలో సురేష్ బాబును కొట్టేవాడు ఉండడు. సహజంగా చాలా మంది స్టార్ హీరోలు సమ్మర్ లో ఈ వేడిలో షూట్ చెయ్యలేక ప్యాక్ అప్ చెప్పేసి హాలిడేకి వెళ్ళిపోతారు. దీని వల్ల సినిమా షూటింగులు ఆలస్యం అవుతాయి. అయితే వెంకీ మామకు ఇలా కాకుండా ఒక మాస్టర్ ప్లాన్ వేశారు ఆయన. ఈ సినిమా కోసం ఒక నెల కాశ్మీర్ లో షూటింగు చెయ్యాల్సి ఉంది. మొదట ఈ షెడ్యూల్ ఆగష్టులో ప్లాన్ చేశారు. సినిమా షూటింగ్ కు బ్రేక్ ఇవ్వకుండా ఆ షెడ్యూల్ ని మే నెలలోకి మార్చేశారు.

ఇప్పటికే అక్కడ పదిహేను రోజుల పాటు షూట్ చేసి ఈ నెల 13న హైదరాబాద్ కు తిరిగి రాబోతున్నారు. ఆ టైం కు రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించేసి వాతావరణం చల్లబడుతుంది. దీనితో షూటింగుకు ఎటువంటి బ్రేక్ పడదు. మామా అల్లుళ్లు వెంకటేశ్, నాగచైతన్య. ఈ ఇద్దరూ మామా అల్లుళ్లుగా నటిస్తున్న చిత్రం ‘వెంకీమామ’. కె.ఎస్‌ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో సురేష్‌ ప్రొడక్షన్, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

వెంకీ సరసన ‘ఆర్ఎక్స్ 100’ పాయల్‌ రాజ్‌పుత్, చైతూ సరసన రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. ఆ మధ్య గోదావరి గట్టున ఉన్న ఓ పల్లెటూరిలో కీలక సన్నివేశాలు చిత్రీరించారు. మరోవైపు ఈ 6న డా. డి. రామానాయుడు జయంతి సందర్భంగా ఈ చిత్రం టీజర్‌ను రిలీజ్‌ చేయాలనుకుంటున్నారని వార్తలు గతంలో వచ్చాయి. అయితే ఇప్పటివరకూ చిత్ర యూనిట్ దానిని ధృవీకరించలేదు. దీనికోసం అక్కినేని, దగ్గుబాటి అభిమానులు వెయ్యికళ్ళతో వేచి చూస్తున్నారు.