Venky -Mamaవిక్టరీ వెంకటేష్, యువసామ్రాట్ నాగచైతన్య నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘వెంకీ మామ’ షూటింగ్ చివరి ఘట్టానికి చేరుకుంది. చివరి షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. ఒక్క పాట తప్ప సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయ్యింది. తొలుత ఈ సినిమాను అక్టోబర్ 4న దసరా సందర్భంగా సినిమాను విడుదల చెయ్యడానికి ప్లాన్ చేశారు అయితే 2న విడుదలయ్యే మెగాస్టార్ చిరంజీవి భారీ చిత్రం సైరా నరసింహారెడ్డితో క్లాష్ కాకుండా వాయిదా వేశారు.

మొన్న ఆ మధ్య అక్టోబర్ 25న దీపావళి సందర్భంగా విడుదల చేస్తామని లీకులు ఇచ్చారు. దసరా వంటి మంచి సీజన్ ను కోల్పోయామని బాధ ఉన్నా సరే గుడ్డిలో మెల్ల అనుకున్నారు ఫ్యాన్స్. ఇప్పుడు మరోసారి వాయిదా పడినట్టు వార్తలు వస్తున్నాయి. అదే తారీఖున తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన బిజిల్ సినిమా కూడా తెలుగులో విడుదల కావడంతో ఆ తేదీన కూడా వచ్చే అవకాశం లేదంటున్నారు. డిసెంబర్ మొదటి వారంలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారట.

డిసెంబర్ విడుదల అంటే పూర్తిగా డల్ సీజన్ అనే చెప్పుకోవాలి. ఎఫ్2 ఘనవిజయంతో ఒక దశాబ్దం తరువాత ఉత్సాహం వచ్చింది వెంకటేష్ అభిమానులకు, వారంతా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి ఆసక్తి కూడా పోయేలా చేస్తున్నారు? ఈ సినిమాలో వెంకటేష్ సరసన పాయల్ రాజ్‌పుత్ నటిస్తుండగా… నాగ చైతన్యకు జోడిగా రాశీ ఖన్నా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డి.సురేష్ బాబుతో కలిసి టిజి విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘జై లవ కుశ’ ఫేమ్ బాబీ దర్శకత్వం వహిస్తున్నారు.