Venkatesh_Rana_Naidu_Netflixఫ్యామిలీ హీరోగా అశేషమైన ఫాలోయింగ్ ఉన్న వెంకటేష్ మొదటిసారి డిజిటల్ డెబ్యూ చేసిన రానా నాయుడు మీద నాన్ స్టాప్ గా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. సోషల్ మీడియా వేదికగా మద్దతుగా కొందరు వ్యతిరేకిస్తూ కొందరు వాదించుకుంటున్నారు. న్యూస్ పేపర్లలో అంతేసి యాడ్లు ఇచ్చారు కానీ ఎక్కడా ఇది కేవలం పెద్దలకు మాత్రమే అని చెప్పకపోవడం వ్యూయర్స్ ని పెంచుతోంది. దీంతో నెగటివిటీకి ఇంకా దారి ఇచ్చినట్టు అయ్యింది. ప్రమోషన్లలో రానా ఈ సిరీస్ అడల్ట్స్ ఓన్లీ అని చెప్పినా, ట్విట్టర్ లో బూతులు ఉన్నాయని జనాలు మొత్తుకున్నా వీటికి దూరంగా ఉండే సగటు జనాలు నేరుగా చూసే అవకాశాలు లేవని చెప్పలేంగా.

ఒకవేళ ఇదే సిరీస్ మిగిలిన ముగ్గురు సీనియర్ హీరోల్లో ఎవరు చేసినా ఇదే స్థాయిలో విమర్శలు వచ్చి పడేవి. అందులో అనుమానం అక్కర్లేదు. కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే అల్లుడా మజాకా రిలీజయ్యాక చిరంజీవి తీవ్ర నిరసన ఎదురుకోవాల్సి వచ్చింది. డబ్బులు వచ్చాయి కానీ అంతకన్నా పెద్ద నష్టం ఇమేజ్ మీద పడింది. ఇదే తరహాలో బాలకృష్ణ ముద్దుల మొగుడు, ఇదే వెంకటేష్ సరదా బుల్లోడు చేశారు కానీ అవి దారుణంగా డిజాస్టర్లు కావడంతో కేవలం ద్వందార్థాల కంటెంట్ తో ప్రేక్షకులను మెప్పించలేమని అర్థం చేసుకుని వాటికి దూరమయ్యారు. సో ఈ అనుభవాలు పాతికేళ్ల క్రితం యువకులుగా ఉన్నప్పుడే వీళ్ళు చవిచూశారు.

సరే ఇక వర్తమానానికి వస్తే నెట్ ఫ్లిక్స్ తన సెక్స్ ఐడియాలజీని సగటు భారతీయ మధ్యతరగతి ఇళ్లలోకి తేవాలని చూస్తోంది. బోల్డ్ కంటెంట్ తో ఎంత విచ్చలవిడితనం చూపించైనా సరే యువతను శృంగారం పట్ల ఎక్కువ ఆసక్తి ఉన్నవాళ్లను టార్గెట్ చేసుకుంటే సబ్స్క్రైబర్స్ పెరుగుతారనే స్ట్రాటజీ ఇక్కడ కనిపిస్తోంది. క్రమంగా ఇలాంటివి పెరిగే కొద్దీ కాలేజీ స్టూడెంట్స్ ఇదంతా మన లైఫ్ లో భాగమే అనుకుని వాటికి అలవాటు పడిపోతే నిజ జీవితంలోనూ వాటిని అనుసరించే ప్రమాదం ఉంది. ఠాగూర్ లు భారతీయుడులో చూసి లంచాలు తీసుకోవడం ఆపని జనాలు ఇడియట్ లు అర్జున్ రెడ్డిలు చూసి ఇదే యాటిట్యూడ్ అనే భ్రమలోకి వెళ్లారు.

ఈ రానా నాయుడు డిబేట్ కొద్దిరోజుల తర్వాత ఆగిపోవచ్చు. కానీ ఇకపై మంచి మార్కెట్ ఉన్న స్టార్ హీరోలు రెమ్యునరేషన్ల కోసమో లేదా జనరేషన్ మారిందనో ఈ టైపు సిరీస్ లు చేస్తూ పోతారా లేక వెంకీకు వచ్చిన స్పందన చూసి దాన్ని హెచ్చరికగా అనుకుని ఆగిపోతారా వేచి చూడాలి. ఎందుకంటే రేపొద్దున ఏ మహేష్ బాబో, నానినో చేస్తే ఇంకా కష్టం. అందరూ ఫాలో అయిపోతారు. అప్పుడు అసలుకే మోసం వస్తుంది. ఒక సాంప్రదాయబద్దమైన హీరోనే ఇన్ని బూతులు మాట్లాడగా తప్పు లేనిది మనమెంతని స్టార్లవుతున్న కుర్ర హీరోలు అనుకుంటే అదింకా డేంజర్. టీనేజ్ త్వరగా ప్రభావితం చెందుతున్న రోజులివి. అక్కడిదాకా రాకూడదనే కోరుకుందాం