Venkatesh - Tharun Bhascker Dhaassyamఎఫ్ 2 విజయంతో జోరు పెంచాడు విక్టరీ వెంకటేష్. ఈ సినిమా ఇచ్చిన జోష్ లో ప్రస్తుతం అల్లుడు నాగచైతన్యతో ‘వెంకీ మామ’ గా సెట్స్ పై చురుకుగా కదులుతున్నాడు వెంకటేష్. ఈ సినిమా చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంటుండగానే ‘పెళ్లి చూపులు’ డైరెక్ట‌ర్ త‌రుణ్ భాస్క‌ర్‌తో వెంకీ ఓ సినిమా చేయ‌బోతున్నార‌ట‌. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించ‌బోతోంది. వెంకీ కోసం హార్స్ రైడింగ్ పై సాగే ఒక క్రీడా నేపధ్యం ఉన్న స్క్రిప్ట్ ను తీసుకొచ్చాడట త‌రుణ్ భాస్క‌ర్‌.

ఈ సినిమానే కాకుండా ‘సినిమా చూపిస్తా మావ, నేను లోక‌ల్‌” చిత్రాల ద‌ర్శ‌కుడు నక్కిన త్రినాథ‌రావుతో వెంకీ మరో సినిమా చేయ‌బోతున్నార‌ట‌. ఈ సినిమా వినోదాత్మ‌కంగా ఉండ‌బోతున్న‌ట్టు స‌మాచారం. అయితే ఇద్దరిలో ఎవరు మొదట బౌండ్ స్క్రిప్ట్ తో రెడీ గా ఉంటారో వారి సినిమా మొదట తెర మీదకు ఎక్కబోతుందట. వెంకీ మామ షూటింగ్ ప్రస్తుతం కాశ్మీర్ లో జరుగుతుంది. వచ్చే వారం అక్కడ పని పూర్తి చేసుకుని హైదరాబాద్ వస్తుంది చిత్ర బృందం.

మరోవైపు వెంకటేష్ ఒక బాలీవుడ్ రీమేక్ పై కన్ను వేశారని కూడా వార్తలు వస్తున్నాయి. అజయ్ దేవగన్, టబు, రకుల్ ప్రీత్ సింగ్ కలసి నటించిన దే దే ప్యార్ దే చిత్రం ఇటీవల విడుదలై ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. వెంకటేష్ బాడీ లాంగ్వేజ్ కు సరిపోయే చిత్రం అని చాలామంది సినీ విశ్లేషకులు తెలిపారు. దీనితో వెంకీ హీరోగా ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయబుతున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. సురేష్ బాబు ఈ చిత్రం రీమేక్ రైట్స్ కొనే పనిలో ఉన్నారట.