Venkatesh, Venkatesh Introduced Heroines List, Venkatesh Introduced Actress List, Venkatesh Introduced Bollywood Heroines Listతనతో వెండితెరకు పరిచయమైన హీరోయిన్లంతా ‘స్టార్ హీరోయిన్’ హోదా అనుభవించడం తనకు సంతోషాన్నిస్తుందని విక్టరీ వెంకటేష్ తెలిపారు. ఖుష్బూ, దివ్యభారతి, టబూ, అంజలా జవేరీ, శిల్పాశెట్టి, ప్రీతి జింటా, కత్రినా కైఫ్ ఇలా ఎంతో మందిని తెలుగు తెరకు పరిచయం చేశానని, వారంతా స్టార్ హోదాను సొంతం చేసుకోవడం సంతోషమేనని విక్టరీ వెల్లడించాడు.

తన గత సినిమాలను చూసి తానే ఆశ్చర్యపోతుంటానని, ‘ఓవర్ యాక్టింగ్’ స్టేజ్ నుంచి ‘సెటిల్డ్ యాక్టింగ్’ స్టేజ్ కి మారిన విధానం ఆశ్చర్యకరంగా ఉంటుందనిఅన్నారు. తనకు ఆర్టిఫిషియల్ గా నటించడం ఇష్టం ఉండదని, రావు గోపాలరావు, ఎస్వీఆర్, రేలంగి, అల్లు రామలింగయ్య వంటి సహజ సిద్ధమైన నటుల నుంచి స్పూర్తి పొందానని వెంకటేష్ చెప్పారు. యాక్షన్ సినిమాలు చేసినా, కుటుంబ కధా చిత్రాలు చేసినా, క్లాసిక్ సినిమాలు చేసినా, హాస్యరస చిత్రాలు చేసినా తనను ఆదరించారని అభిమానులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు వెంకీ.

విదేశాల్లో ఎంబీయే పూర్తి చేసిన తరువాత సుగంధ ద్రవ్యాల బిజినెస్ చేద్దామని ఆలోచించే వాడినని, అయితే తాను ఊహించినట్టు జరగలేదని, భగవదేశ్చ ప్రకారం సినీ నటుడిని అయ్యానని అన్నారు. టాలీవుడ్ లో అడుగుపెట్టిన తొలినాళ్లలో ఎంబీఏ పూర్తి చేసి, స్పెషలైజేషన్ చేసి, ‘అ…ఆ…’లు నేర్చుకోవడమేంటని ఆలోచించేవాడిని, తెలుగు పలకడం సరిగ్గా వచ్చేది కాదని, రెండు గంటలు శిక్షణ తీసుకునే వాడినని, గంటల తరబడి ప్రాక్టీస్ చేసేవాడినని, స్కూల్, కాలేజీల్లో కూడా అంత కష్టపడలేదని, ఆ డైలాగులు చదువుకునేందుకు ఓ రూంలోకి వెళ్లిపోయి బట్టీపట్టేవాడినని చెప్పిన సంగతులు నవ్వులు పూయిస్తున్నాయి.

అయితే తన తండ్రి నుంచి సహజసిద్ధంగా అబ్బిన గుణం… ఏం చేసినా వంద శాతం కష్టపడడం… తనను ఇన్నేళ్లు సినీ పరిశ్రమలో నిలదొక్కుకునేలా చేసిందని చెప్పారు. ఇప్పటికీ తనకు కొన్ని విషయాలు అర్ధం కావని, సెట్ కు వచ్చిన తరువాత దర్శకుడు ఎలా చెబితే అలా చేయడమే తనకు తెలిసిన విధానమని, అలా చేయడం వల్లే ఇప్పటికీ తనతో సినిమాలు చేసేందుకు దర్శకులు ముందుకు వస్తున్నారని… క్రమశిక్షణ విషయంలో వెంకీ అభిమతం ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పారు.