తెలుగునాట సీక్వెల్ సంస్కృతి తక్కువ, ఒక్క ‘బాహుబలి’ మినహా మిగతా ఏ సినిమా కూడా సీక్వెల్ పార్ట్ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కానీ నేడు విడుదల చేసిన విక్టరీ వెంకటేష్ “దృశ్యం 2” టీజర్ సినిమా పట్ల ఆసక్తిని పెంచేలా ఉంది. ‘దృశ్యం’ సినిమా కధను కొనసాగిస్తూ రూపొందిన ఈ సినిమాకు ఒరిజినల్ మూవీకి దర్శకత్వం వహించిన జీతూ జోసెఫ్ తెరకెక్కించారు.

ఇప్పటికే ఈ సినిమా మలయాళంలో విడుదలై బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపించగా, తెలుగులో మాత్రం అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 25వ తేదీన నేరుగా విడుదల కాబోతోంది. విక్టరీ వెంకటేష్ నటించిన రెండవ సినిమా వరుసగా ఓటీటీలో విడుదల కావడం అభిమానులకు నిరుత్సాహపరిచే అంశం. “నారప్ప” కూడా ప్రైమ్ లో విడుదలై ఫ్యాన్స్ కు చేదు అనుభవాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే.

Also Read – బిఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోతోంది… ఎందువల్ల?

దీంతో వెంకీ… నో హ్యాట్రిక్ ఓటీటీ ప్లీజ్… అనడం అభిమానుల వంతవుతోంది. ముఖ్యంగా ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు సిల్వర్ స్క్రీన్ పై చూస్తే కలిగే అనుభూతి వేరు కదా! అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో వెండితెరపై రిలీజ్ కన్నా, ఓటీటీలో రిలీజ్ చేయడం నిర్మాతల పరంగా సముచితమైన నిర్ణయంగానే భావించవచ్చు. ఎంతైనా ఫైనాన్షియల్ డీల్స్ లో నిర్మాత సురేష్ బాబు దిట్ట కదా!