Venkatapuram Movie First 9 minsసిల్వర్ స్క్రీన్ పైన సినిమా విడుదల కాక ముందే ఇంటర్నెట్ లో ప్రత్యక్షమవుతున్న రోజులివి. అలాగే ధియేటర్లో బొమ్మ పడిన కొద్ది గంటలకే పైరసీ రూపంలో వెబ్ ప్రపంచంలో దర్శనమిస్తున్న రోజులు కూడా! మరి ఇలాంటి రోజుల్లో కూడా ‘బాహుబలి’ వంటి పెద్ద సినిమాలకైతే ప్రేక్షకులు ధియేటర్లకు పరుగులు పెట్టి ఎన్ని వందల కోట్లైనా కలెక్షన్లు ఇస్తారు, కానీ చిన్న సినిమాల పరిస్థితి వేరు. కాస్త కంటెంట్ ఉంటేనే ఆ ధియేటర్ ముఖం చూసే పరిస్థితి, లేదంటే కనీసం పోస్టర్ వైపు కన్నెత్తి చూడడం కూడా కష్టం.

అందులోనూ ‘బాహుబలి 2’ లాంటి అద్భుతాన్ని చూసిన కళ్ళతో ‘వెంకటాపురం’ లాంటి చిన్న సినిమాను చూడాలంటే, సినిమాలో కంటెంట్ బలంగా ఉండాలి. గత వారం విడుదలైన ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ తో పోలిస్తే, రెవిన్యూ బాగానే వచ్చిందని చిత్ర నిర్మాతలు పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నారు. అయితే దీనిని మరింత పెంచుకునేందుకు, తాజాగా యూ ట్యూబ్ లో ఈ సినిమాను రిలీజ్ చేసారు. అయితే సినిమా మొత్తం కాదులేండి… ఆసలు సినిమా కంటెంట్ ను తెలిపే మొదటి 9 నిముషాల సినిమాను రిలీజ్ చేసారు.

ఈ 9 నిముషాలు సినిమా ఏంటి అన్న ఆసక్తిని కలిగించడంలో సక్సెస్ అయ్యింది కాబట్టే దీనిని విడుదల చేసారు. పబ్లిసిటీలో భాగంగా ఇలా విడుదల చేయడం ‘వెంకటాపురం’తోనే ప్రారంభం కాదు. గతంలో శేఖర్ కమ్ముల ‘అనామిక’ సినిమాను విడుదలకు ముందే 10 నిముషాల పాటు విడుదల చేయగా, ఇటీవల విజయ్ అంటోనీ సినిమాలు ‘భేతాళుడు, యమన్’ కూడా 9, 10 నిముషాల సన్నివేశాలను రిలీజ్ కు ముందే యూ ట్యూబ్ లో విడుదల చేసి సినిమాపై ఆసక్తిని పెంచారు. అయితే వీటి వలన పెద్దగా ప్రయోజనం లేదన్నది ట్రేడ్ టాక్.