Venkat Maha Movie on reviewersటాలీవుడ్ టాప్ సెలబ్రిటీలతో పాటు సినీ విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమాగా “కేరాఫ్ కంచరపాలెం” నిలిచిన విషయం తెలిసిందే. విడుదలకు ముందు నుండి వ్యక్తమైన పాజిటివ్ టాక్, విడుదల తర్వాత వ్యక్తమైన సినీ రివ్యూలతో మరింత రెట్టింపయ్యింది. ఈ ప్రభావంతోనే అటు యుఎస్ నుండి ఇటు రెండు తెలుగు రాష్ట్రాల వరకు కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

ముఖ్యంగా యుఎస్ లో 2 లక్షల డాలర్లకు పైనే వసూలు చేసిందంటే… అందులో సినీ విశ్లేషణల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. మరి అలాంటి రివ్యూలపై ‘కేరాఫ్ కంచరపాలెం’ దర్శకుడు మహా వెంకటేష్ తింగరి కామెంట్స్ చేయడం కొసమెరుపు. ఈ సినిమాకు వెబ్ మీడియా మొత్తం చాలా ప్రమోట్ చేసి, సినిమాను ఒక స్థాయిలో నిలిపింది. ఏవో ఒకటి, రెండు మినహా ప్రధాన వెబ్ మీడియా అంతా సహకారం అందించగా, తాజా ఇంటర్వ్యూలో అలాంటి వెబ్ మీడియాపై అనుచిత కామెంట్స్ చేసాడు వెంకీ.

రివ్యూలు ఇవ్వడానికి కొలమానం ఏముంది? అలా ఉంటే ఒక్కో వెబ్ సైట్ కు తేడా ఎందుకు వస్తోంది? అంటూ తీవ్రంగా స్పందించారు. బహుశా ఈ సినిమా బిజినెస్ జరిగిపోయిందని భావించారో ఏమో లేక సినిమాకు మరింత పబ్లిసిటీ కావాలని అనుకున్నారో ఏమో గానీ, సినిమా విడుదలైన వారం రోజుల తర్వాత రివ్యూలను ఉద్దేశిస్తూ వెబ్ మీడియాపై విరుచుకుపడ్డారు.

దర్శకుడిగా మహా వెంకటేష్ అంటే ఎవరో తెలియని ప్రేక్షకులకు చేరువ చేయడంలో, కేరాఫ్ కంచరపాలెం సూపర్ హిట్ కావడంలో వెబ్ మీడియా పోషించిన పాత్ర చాలా కీలకం. సక్సెస్ నెత్తికెక్కడం ఇండస్ట్రీలో సర్వసాధారణంగా జరిగే విషయం. మరి మహా వెంకటేష్ విషయంలోనూ ‘కేరాఫ్ కంచరపాలెం’ సక్సెస్ ఇలాగే నెత్తికెక్కి, ఇలాంటి తింగరి వ్యాఖ్యలు చేసారా? అనేది త్వరలో తెలియనుంది.