venkaiah-naidu-polavaramమొన్నటి వరకు డిఫెన్స్ లో ఉన్న బిజెపి వర్గమంతా ఒక్కసారిగా తమ విమర్శల జోరును పెంచింది. ఎప్పుడైతే, ప్రత్యేక ప్యాకేజ్ ను ఏపీ సర్కార్ ఓకే చెప్పిందో, ఆనాటి నుండి తమపై వస్తున్న విమర్శలకు బిజెపి ఎదురుదాడి చేస్తోంది. ముఖ్యంగా అంతకుముందు వెంకయ్య నాయుడు సెంటర్ పాయింట్ గా విమర్శలను గుప్పించిన వారికి, స్వయంగా వెంకయ్య నాయుడే పరోక్షంగానో, ప్రత్యక్షంగానో బదులిస్తున్నారు.

తాజాగా కూడా పోలవరం ప్రాజెక్ట్ కు ఇప్పటివరకు కేంద్రం కేటాయించిన 100 కోట్లను ఉద్దేశించి వ్యక్తమవుతున్న విమర్శలకు వెంకయ్య నాయుడు ధీటుగా స్పందించారు. “కేంద్రం కేటాయించిన 100 కోట్ల రూపాయలను ‘ముష్టి’ అంటున్నారని, నిజంగా ఎవరైనా ముష్టిగా 100 కోట్లు వేసేటట్లయితే నేను రోజూ పోయి ముష్టి అడుగుతాను, ఆ డబ్బంతా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఖర్చు పెడతాను, దీనికి తనకేమీ అభ్యంతరం లేదు” అంటూ తీవ్రంగా స్పందించారు.

“అయినా 100 కోట్ల రూపాయలను ముష్టిగా పరిగణిస్తున్నారంటే, వాళ్ళు ఎన్ని వందల కోట్లను కొట్టేసిన వాళ్ళు… అలాగే ఎన్ని వందల కోట్లను దోచుకున్నవాళ్ళు…? అంటూ పరోక్షంగా ఎవరిని టార్గెట్ చేసారో చెప్పకనే చెప్పారు. ఇలాంటి మాటలనీ దుర్మార్గమైనవి, పోలవరం ప్రాజెక్ట్ కు ఉన్న అడ్డంకులను తొలగించిన ఘనత మాదే, పూర్తి చేసేది కూడా మేమే” అంటూ వెంకయ్య నాయుడు ‘100 కోట్ల ముష్టి’పై స్పందించారు.