venkaiah naidu cheating andhra peopleరాష్ట విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి “ప్రత్యేక హోదా” గురించి పార్లమెంట్ వేదికగా వెంకయ్య నాయుడు గారు వినిపించిన “స్వరం” బహుశా అందిరికీ గుర్తుండే ఉంటుంది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్వరంలో ‘పదనిసలు’ ఏపీ ప్రజలు గ్రహించే ఉంటారు. దేశంలోని మిగతా రాష్ట్రాలు ఒప్పుకోవడం లేదని ఒకసారి, ప్రత్యేక హోదా కంటే ఎక్కువగా ఏపీకి కేంద్రం సమకూరుస్తుందని మరోసారి, ప్రత్యేక హోదా కంటే ప్యాకేజ్ ఉత్తమమని ఇంకోసారి… ఇలా రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వదనే సంకేతాలను ప్రజల్లోకి పంపించారు.

అయితే ఈ అంశాన్ని పూర్తిగా వదిలేయలేదని, ‘నీతిఅయోగ్’ పరిశీలనలో ఉందని, ఖచ్చితంగా ‘స్పెషల్ స్టేటస్’ కోసం మిగతా రాష్ట్రాలను ఒప్పించి ఏపీకి ఇప్పించే బాధ్యత కేంద్రంపై ఉందని చెబుతూ వచ్చారు. ఇలా భిన్న వాదనలు వినిపిస్తూ ఏపీ ప్రజలతో ‘మైండ్ గేమ్’ ఆడుతున్న వెంకయ్య నాయుడు, తాజాగా ఇచ్చిన ప్రకటన రాష్ట ప్రజల ఆగ్రహానికి గురయ్యేలా చేసింది.

“ప్రత్యేక హోదా వలన ఎలాంటి ప్రయోజనం ఉండదని, ఏపీకి కేంద్రమే ప్రత్యేక గుర్తింపు ఇస్తోందని, 18 నెలలుగా రాష్ట్రానికి కేంద్రం ఎంతో సాయం చేసిందని, ఇక ముందు కూడా మరింతగా ఏపీకి వనరులు ఇస్తామంటూ” చెప్పి, స్పెషల్ స్టేటస్ అంశం ఏపీకి అసలు పనికి రానిదిగా అభిప్రాయపడ్డారు. ప్రజలను పిచ్చివాళ్లను చేస్తూ ఇస్తున్న ఈ రాజకీయ ప్రకటనలకు ముగింపు ఎప్పుడు ఉంటుందా అని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాసేపు మోడీ పరిశీలిస్తున్నారని, ఇంకాసేపు నీతిఅయోగ్ చర్చిస్తోందని ఆశలు రేకెత్తిస్తూ… మరోవైపు నుండి అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడుల ద్వారా కేంద్రం నీళ్ళు జల్లే ప్రకటనలు ఏ మేరకు లబ్ధి చేకూరుస్తాయో గానీ, ఏపీ ప్రజలు మాత్రం వీటిని తీవ్రంగా పరిగణిస్తున్నారు.