Venkaiah Naidu, Venkaiah Naidu Cheated AP, BJP MP Venkaiah Naidu Cheated AP, Venkaiah Naidu Cheated Andhra Pradesh, MP Venkaiah Naidu Cheated AP, Venkaiah Naidu Cheated AP Special Status, Venkaiah Naidu Cheated Andhra Pradesh Special Status‘చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం’ అన్న చందంగా కేంద్రం నుండి ఎంత వస్తే అంత మొత్తాన్ని రాష్ట్ర అభివృద్ధి కోసం వినియోగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలు చేస్తున్న వైనం తెలిసిందే. ఇదే విషయాన్ని చాలా సందర్భాలలో స్వయంగా చంద్రబాబే చెప్పారు కూడా! దీంతో తాజాగా కేంద్రం ప్రకటించిన ‘ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజ్’పై లేనిపోని విమర్శలు చేసే కన్నా… ఇచ్చిన మొత్తాన్ని తీసుకుని రాష్ట్ర ప్రగతికి పాటు పడతానని, ఒక ముఖ్యమంత్రిగా తన బాధ్యత ఇదని చంద్రబాబు స్పష్టం చేసారు.

నిజమే… సిఎం హోదాలో ఉండి రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచనలు చేసే ఎవరైనా… అలాగే చేస్తారు. అసలే అరకొర నిదులతో సరిపెడుతున్న కేంద్రం నుండి భారీ ప్యాకేజ్ ప్రకటన వస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి కొంత ఊరట కలగడం సహజమే. సరిగ్గా చంద్రబాబు కూడా ఇలాగే స్పందించారు. కానీ, కేంద్రం ప్రకటించిన భారీ ప్యాకేజ్ వెనుక చాలా మతలబే దాగి ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అందులో ప్రధానమైనది ‘సమయ పరిమితి.’

విభజన చట్టంలో అయిదు సంవత్సరాలు మాత్రమే ఉంది కనుక, మేము ప్రకటించే ప్యాకేజ్ అయిదు సంవత్సరాల వరకే పరిమితం అంటూ ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఒకటికి రెండు సార్లు మీడియా సమక్షంలో నొక్కివక్కాణించారు. దీనిని మరో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారు కూడా సమర్ధించారు. అయితే ఆ అయిదు సంవత్సరాల కాలం పరిశీలిస్తే… ఎవరైనా అవాక్కవ్వాల్సిందే. గడిచిపోయిన ఏడాదిన్నర్ర కాలాన్ని కూడా ఈ అయిదు సంవత్సరాలలో ఉండడం గమనించదగ్గ విషయం.

2015 నుండి 2020 వరకు మాత్రమే ఈ ప్యాకేజ్ ల నిబంధనలు వర్తిస్తాయని సెలవిచ్చారు అరుణ్ జైట్లీ. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… కేంద్రం నేరుగా లక్షన్నర్ర కోట్లను రాష్ట్ర ఖజానాలో వేయడం లేదు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా ఈ ప్యాకేజ్ ను దఫాల వారీగా విడుదల చేస్తారు. ప్రకటించిన కాలంలో ఇప్పటికే దాదాపు ఏడాదిన్నర్ర పూర్తయ్యింది. అలాగే కేంద్రం ప్యాకేజ్ ప్రకటించింది కదా అని ఇప్పటికిప్పుడు అన్ని కార్యక్రమాలను ప్రారంభించడం సులువు కాదు. గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకోవడానికి కనీసం మరో ఆరు మాసాలైనా రాష్ట్ర ప్రభుత్వానికి సమయం పడుతుంది.

ఇక, మిగిలి ఉన్న కాలం కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే. ఈ మూడు సంవత్సరాల కాలాన్ని పరిశీలిస్తే… 2020కు ముందు అంటే 2019లో మళ్ళీ సార్వత్రిక ఎన్నికలు వస్తాయి. అంటే దాదాపుగా ఒక ఏడాది నుండి ఆరు నెలల పాటు ప్రగతి అనేది దూరం కావడం తధ్యం. ఇలా ప్రకటించిన అయిదేళ్ళ కాలంలో సరిగ్గా రాష్ట్రానికి మిగిలి ఉంది కేవలం రెండే రెండు సంవత్సరాలు. మరి ఈ రెండేళ్ళల్లో ఓ స్థాయిలో అభివృద్ధి జరిగితే గానీ, ఆ లక్షన్నర్ర కోట్ల ప్యాకేజ్ ఏపీ సొంతం కాదు. ఇందులోనూ కేంద్రం మెలికలు పెట్టే అవకాశాలు లేకపోలేదు. ఇలా గడిచిపోయిన కాలాన్ని కూడా కాలపరిమితిలో చేర్చి మరోసారి తన అతితెలివిని ప్రదర్శించింది కేంద్రం.

గతంలో 68 వేల కోట్లను ఏపీకి మంజూరు చేసామని, దేశవ్యాప్తంగా జరుగుతున్న పనులను కూడా ఇందులో చేర్చి తమ తెలివి తేటలను ప్రదర్శించిన కేంద్రం, మరోసారి ఏపీ ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టే ప్రయత్నం చేస్తోంది. అలాగే గతంలో మాదిరే తాజా ప్రకటనలో కూడా అన్ని హామీలు తప్ప, ఎక్కడా ఒక నిర్దిష్ట ప్రణాళిక లేకపోవడం అనేది ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్రం తీరుకు అద్దం పడుతోందని రాజకీయ విశ్లేషకుల మాట.