pawan-kalyan-venkaiah-naiduతిరుపతి, కాకినాడ సభల వేదికగా బిజెపిపై తీవ్ర స్థాయిలో మండిపడిన ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్… ఓట్లు అడగడానికి ఏపీ నుండి ప్రచారం చేసి, నేడు పాచిపోయిన లడ్డూలను ప్రకటించేటపుడు ఢిల్లీని ఎంచుకుంటారా? దమ్ముంటే… ‘స్పెషల్ స్టేటస్’ ఇవ్వం… కేవలం ప్యాకేజీనే ఇస్తామని ఏపీకొచ్చి ప్రకటించండి… విశాఖకొచ్చి ప్రకటన చేయండి… కర్నూలుకు వచ్చి చెప్పండి… అప్పుడు ప్రజా స్పందన చూడండి… అంటూ బిజెపికి పెను సవాల్ నే విసిరారు.

వెంకయ్య నాయుడును టార్గెట్ చేసుకుని ఆనాడు విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ సవాల్ ను కేంద్రమంత్రి గారు కూడా సీరియస్ గా పరిగణించినట్లున్నారు. నేడు విశాఖ విచ్చేసిన వెంకయ్య నాయుడు, ‘ప్రత్యేక హోదా’ ఇవ్వలేమని తేల్చిచెప్పేశారు. అలాగే ‘ప్రత్యేక ప్యాకేజ్’తోనే అభివృద్ధి సాధ్యమని కూడా అన్నారు. ప్యాకేజ్ ప్రకటించిన తర్వాత తొలిసారి విచ్చేసిన వెంకయ్య నాయుడు, “ఆనాడు ప్రత్యేక హోదా కోసం తానూ డిమాండ్ చేసిన మాట వాస్తవమే అయితే, ఇప్పుడు ఏమీ చేయలేను, అందుకు సమానుకూలమైన నిధులు ఇప్పించడం తప్ప” అంటూ పవన్ ప్రశ్నలను గుర్తు చేసే విధంగా మాట్లాడారు.

‘ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలకు రాయితీలు వస్తాయన్న మాట నిజం కాదని, ప్రత్యేక హోదా వస్తే 90 శాతం నిధులు కేంద్రం, 10 శాతం రాష్ట్రం భరించాల్సి ఉంటుందని, హోదా లేకుంటే 60:40 నిష్పత్తిలో నిధుల ఖర్చు ఉంటుందని, అయితే ఇపుడు ఆ తేడాగా ఉన్న 30 శాతం కూడా కేంద్రమే ఇస్తుందని, అంతవరకు తానూ చేయగలిగానని” స్పష్టంగా విశాఖ వేదికగా వెల్లడించారు. అంతేకాదు, ఏపీ ప్రజలు ఇంకా హోదా సంగతి పక్కనపెట్టి, అసత్య ప్రచారాలను తిప్పుకోడుతూ, ప్యాకేజ్ తో అభివృద్ధి దిశగా ముందుకు వెళ్ళాలని పిలుపునిచ్చారు.

పవన్ చెప్తున్నట్లు… ‘ప్రత్యేక హోదా’పై ఎంపీలు పోరాడతారనుకుంటే అది కలగానే భావించవచ్చు. సాక్షాత్తూ వెంకయ్య నాయుడు ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఇంకా ఆశలు పెట్టుకుంటే అది మూర్ఖత్వమే అవుతుంది. టిడిపి సర్కార్ కూడా ప్యాకేజ్ తోనే ముందుకెళ్తామని మరోసారి చెప్పింది. ఎంతిస్తే… అంత తీసుకుంటామని రాష్ట్ర ఆర్ధిక మంత్రివర్యులు యనమల రామకృష్ణుడు స్పష్టంగా నేడు మరోసారి తేల్చిచెప్పారు. మరో వైపు ప్రతిపక్షం ఒక రోజు ‘బంద్’ ప్రకటించి చేతులు దులుపుకుంది, అది కూడా సక్సెస్ కాని బంద్ తో..! దీంతో ‘ఇంకా సమయం ఉంది… వేచిచూద్దాం…’ అన్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచిన పవన్, ఒక్కసారి పునరాలోచించుకోవాలేమో..!