Vendetta on Pawan-Kalyan Ippatam-Houses-Demolitionఅధికార వైసీపీ టిడిపి, జనసేనల నేతలపై ఏవిదంగా రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందో అందరూ చూస్తూనే ఉన్నారు. కానీ ఓ గ్రామంపై ప్రభుత్వమే కక్ష సాధించడం ఎక్కడా చూసి ఉండము. మంగళగిరి నియోజకవర్గంలో ఇప్పటం గ్రామంలో అది చూడవచ్చు. ఇంతకీ గ్రామస్తులు చేసిన పాపం ఏమిటంటే, ఈ ఏడాది మార్చి 14న జనసేన ఆవిర్భావ సభకు మంగళగిరిలో ఎక్కడా స్థలం దొరక్కుండా వైసీపీ నేతలు అడ్డుకొంటే, ఇప్పటం గ్రామస్తులు తమ ఊరిలో సభ జరుపుకొనేందుకు స్థలం ఇవ్వడమే.

తాము వద్దని చెపుతున్నా వినకుండా జనసేనకు స్థలం ఇచ్చినందుకు మరుసటి నెలలోనే ఇప్పటం గ్రామంలో రోడ్లు వెడల్పు చేయబోతున్నట్లు గ్రామస్తులకు నోటీసులు ఇచ్చి ఇళ్ళు కూలగొట్టడానికి సిద్దం అయ్యింది వైసీపీ ప్రభుత్వం. ఇంతకాలం ఎలాగో అడ్డుకోగలిగారు కానీ ఈరోజు ఉదయం అధికారులు జేసీబీతో వచ్చి గ్రామంలో ఇళ్లను కూల్చివేయడం ప్రారంభిచారు. వారిని అడ్డుకొనేందుకు ప్రయత్నించిన జనసేన కార్యకర్తలను, మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఇప్పటం గ్రామంలో ఇళ్ళు కూల్చివేతపై జనసేన అధ్యక్షుడు వెంటనే స్పందిస్తూ సోషల్ మీడియాలో ‘కూల్చివేతల ప్రభుత్వం కూలిపోతుంది,” అంటూ ఓ లేఖ విడుదల చేశారు. “వైసీపీకి ఓటు వేసినవారు మాత్రమే మనవాళ్లు మిగిలినవాళ్ళందరూ మన శత్రువులే వాళ్ళని తొక్కి నారతీయండి అన్నట్లు చాలా దుర్మార్గంగా సాగుతోంది వైసీపీ రాక్షస పాలన. ఇప్పటం గ్రామంలో ప్రజలు జనసేన సభకు స్థలం ఇచ్చారనే కక్షతోనే ఇళ్ళు కూల్చివేస్తున్నారు. గ్రామంలో 70 అడుగుల వెడల్పు గల రోడ్డు ఉండగా వాహనాలు తిరగని ఆ రోడ్డును అర్జెంటుగా 120 అడుగులకి విస్తరించాలని స్థానిక వైసీపీ నేతకి ఎందుకు అనిపించందనే జనసేన సభకు స్థలం ఇచ్చారనే కక్షతోనే.

గ్రామంలో విస్తరణ చేస్తున్న రోడ్డు పక్కనే మంచినీటి ట్యాంక్ ఉంది. దానిని అలాగే విడిచిపెట్టి దాని పక్కనే ఉన్న ఇంటిని కూల్చివేశారు. రెండు రోజుల క్రితం మా పార్టీ నేత నాదెండ్ల మనోహర్ రాత్రి ఇప్పటం గ్రామానికి వెళ్లినప్పుడు వైసీపీ నేతలు విద్యుత్‌ సరఫరా నిలిపివేయించి తమ కుసంస్కారాన్ని చాటుకొన్నారు. కూల్చివేతలతో పాలన ప్రారంభించిన ఈ ప్రభుత్వం కూలిపోవడానికి ఎన్నో రోజులు లేవు. ఇప్పటం గ్రామ ప్రజలకు జనసేన అండగా నిలబడుతుంది,” అని పవన్‌ కళ్యాణ్‌ లేఖలో వ్రాసారు.