Vellampalli Srinivasఈరోజు అనంతపురం జిల్లాలో నందమూరి బాలకృష్ణ ప్రెస్‌మీట్‌లో జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడటంతో వైసీపీ ఎదురుదాడి ప్రారంభించింది. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, “త్వరలోనే మా పార్టీ బరస్ట్ అవుతుందని, మా ఎమ్మెల్యేలు టిడిపికి క్యూ కడతారని బాలకృష్ణ చెప్పుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. మా పార్టీలో బరస్ట్ కాదు బ్లాస్ట్ కాబోతోంది. వచ్చే ఎన్నికలలో 175 సీట్లు మేమే గెలుచుకోబోతున్నాము. అదే మా బ్లాస్టింగ్. మా పార్టీ బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి. ఆయనే ఫోటోతోనే మేమందరం భారీ మెజార్టీతో గెలువబోతున్నాము. ఎందుకంటే జగనన్న పాలనలో రాష్ట్రంలో ప్రతీ ఒక్క కుటుంబానికి సంక్షేమ పధకాలు అందజేసి చాలా మేలు చేస్తున్నారు. కనుకనే మేము ధైర్యంగా ఇంటింటికీ వెళ్ళి ప్రజలను ఓట్లు అడగగలుగుతున్నాము.

కానీ చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినా ఏనాడూ ఇంటింటికీ వెళ్ళలేదు. ఎందుకంటే ఆయన ప్రజల కోసం ఏమీ చేయలేదు కనుక. మేము ఒంటరిగా 175 సీట్లలో పోటీ చేస్తామని ధైర్యంగా చెపుతున్నాము. మా ముఖ్యమంత్రి అభ్యర్ధి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోగలము. మరి టిడిపి పొత్తులు పెట్టుకోకుండా 175 సీట్లలో ఒంటరిగా పోటీ చేయగలదా?చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అభ్యర్ధి అని ప్రకటించగలరా?” అని ప్రశ్నించారు.

ఏ ప్రభుత్వామైనా ప్రజల ఆకాంక్షలను అర్దం చేసుకొని పరిపాలన చేస్తుంటే, ఇలా ఇంటింటికీ వెళ్ళి ఓట్లు అడ్డుక్కోవలసిన అవసరమే ఉండదు. చంద్రబాబు నాయుడు పాలనలో ఎప్పుడూ అభివృద్ధి జరుగుతూనే ఉంటుంది కనుకనే టిడిపి ఇంటింటికీ వెళ్ళి ఓట్లు అడ్డుక్కోవలసిన అవసరం ఎన్నడూ ఏర్పడలేదు. అది టిడిపికి గర్వకారణమే కదా?

కానీ వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్ళలో ఏమీ చేయలేదు. కనీసం అదే కనిపెట్టిన మూడు రాజధానులను కూడా ఇంతవరకు ఏర్పాటు చేయలేకపోయింది. అభివృద్ధి అంటే సంక్షేమ పధకాలే అని వైసీపీలో అందరూ భ్రమలో ఉంటూ అవే తమని ఎన్నికలలో గట్టెక్కిస్తాయనుకొన్నారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల దెబ్బతో ఆ భ్రమలు తొలగిపోయి ఇంటింటికీ వెళ్ళి ఓట్లు అడ్డుక్కోక తప్పడం లేదు. అదే గొప్ప విషయమనుకొంటే అందుకు వారిపై జాలి పడాల్సిందే.

ప్రజలు మార్పు కోరుకొంటున్నారనే విషయం ఎమ్మెల్సీ ఎన్నికలతో, నారా లోకేష్‌ యువగళం పాదయాత్రతో, చంద్రబాబు నాయుడు పర్యటనలతో అర్దమవుతోంది. వైసీపీ నేతలు కూడా ఈ విషయం బాగానే గుర్తించారు. కానీ ఓటమి భయం వెంటాడుతుంటే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. అసలు ఇంటింటికీ వెళ్ళి ఓట్లు అడ్డుక్కోవాలనుకొన్నప్పుడే వైసీపీ ఓటమిని అంగీకరించిన్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సంక్షేమ పధకాలతో ప్రజలు సంతృప్తి చెందితే, 175 సీట్లతో వైసీపీని నెత్తిన పెట్టుకొనే మాటయితే, మళ్ళీ ఇంటింటికీ వెళ్ళి ఓట్లు అడ్డుక్కోవలసిన అవసరం ఏమిటి?అంటే సంక్షేమ పధకాలు తమను గట్టెక్కించలేవని గ్రహించబట్టే కదా? ఇంతకాలం ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా మేము పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అన్నట్లు వ్యవహరిస్తున్నందున ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని గుర్తించబట్టే కదా?అసలు జగనన్నే మా భవిష్యత్‌ అని ప్రజల చేత అనిపించడం కాదు… వైసీపీలో అందరూ అనుకొంటున్నారో లేదో ఓసారి ఇప్పుడే ఆత్మపరిశీలన చేసుకొంటే మంచిదేమో?