Velampalli Srinivasa Rao - YS Jagan - Chintamani Natakamఅధికారంలోకి వచ్చిన తర్వాత సీపీఎస్ రద్దు, మండలి రద్దు, మద్యపానం రద్దు వంటి అనేక నిషేధాలను ప్రతిపాదించి చివరికి చింతామణి నాటకాన్ని రద్దు చేసారంటూ జగన్ సర్కార్ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వెలువడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చింతామణి నాటక రద్దుపై కూడా రగడ రాజుకుంది.

విశాఖపట్టణంలోని మద్దిలపాలెం జంక్షన్ లో తెలుగు భాషా ప్రేమికులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలుగు తల్లి విగ్రహం వద్ద నిరసనకు దిగారు. ఈ కార్యక్రమంలో ‘జబర్దస్త్’ షో కమెడియన్ అప్పారావు కూడా పాల్గొని జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం సముచితం కాదంటూ తన అభ్యంతరాలను వ్యక్తపరిచారు.

1920లో చింతామణి నాటకాన్ని ప్రముఖ రచయిత కాళ్ళకూరి నారాయణరావు రచించారని, అప్పటినుండి ప్రదర్శితం అవుతోన్న నాటకంపై నేడు నిషేధం విధించడం సమంజసం కాదని, కళలను, కళాకారులను ప్రోత్సహించాలని కోరుతూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసారు.

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రాజధాని వంటి అనేక కీలక నిర్ణయాలను అమలుచేసి, నిరసనలు వ్యక్తం అయిన తర్వాత వాటిని వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. మరి తాజాగా వ్యక్తమవుతోన్న ఆందోళనలతో చింతామణి నాటక రద్దును కూడా జగన్ సర్కార్ వెనక్కి తీసుకుంటుందేమో చూడాలి. అయితే ఈ విషయాన్ని వైశ్య కులంతో ముడిపెట్టేసిన విషయం తెలిసిందే.