Udayabhanu_Samineni_Velampalli_Srinivasa_Raoవైసీపీ నేతలు నిత్యం టిడిపి, జనసేన అధినేతలతో కత్తులు దూయడమే కాదు… తమలో తాము కూడా కత్తులు దూసుకొంటారు. అటు నెల్లూరు నుంచి చిత్తూరు వరకు, అటు అనంతపురం నుంచి ఇటు శ్రీకాకుళం వరకు ప్రతీ జిల్లాలో వైసీపీలో ఇదే పరిస్థితి నెలకొంది.

ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాలకి ప్రధాన కేంద్రంగా నిలుస్తున్న విజయవాడలో అయితే వైసీపీ నేతల మద్య యుద్ధాలు మరికాస్త ఎక్కువగానే ఉంటాయి. ఇందుకు తాజా ఉదాహరణగా జగ్గయ్యపేట వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, విజయవాడ పశ్చిమ వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు మద్య మంగళవారం జరిగిన గొడవ కనిపిస్తోంది.

ఎమ్మెల్యే సామినేని ఉదయభాను నిన్న నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్‌ని కలిసి తిరిగి వస్తుండగా, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆయనకి ఎదురయ్యారు. ఉదయభానుని చూడగానే ఆయన ఆగ్రహంతో ఊగిపోతూ, “ఏంటి… నా నియోజకవర్గంలో నామీద పోటీ చేసిన కాంగ్రెస్‌ నాయకుడిని సిఎం జగన్‌ దగ్గరకి తీసుకువెళ్ళేంత పోటుగాడివయ్యవా నువ్వు?మరీ రెచ్చిపోకు…” అంటూ వార్నింగ్ ఇచ్చారు.

దాంతో ఎమ్మెల్యే ఉదయభాను కూడా తీవ్రంగా స్పందిస్తూ, “నేను నీలాగా టికెట్లు, పదవుల కోసం మూడు పార్టీలు మారి వైసీపీలోకి రాలేదు. నువ్వు పార్టీలు మార్చే ఊసరవెల్లివి. నా అంతటి సీనియర్ నాయకుడిని నువ్వా ప్రశ్నించేది?నువ్వు నాకు చెప్పేదేంటి? నోరు కాస్త అదుపులో పెట్టుకొని మాట్లాడు… లేకుంటే మర్యాదగా ఉండదు,” అంటూ ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు.

ఇంతకీ విషయం ఏమిటంటే, 2014 శాసనసభ ఎన్నికలలో వెల్లంపల్లి శ్రీనివాసరావు బిజెపి అభ్యర్ధిగా, ఆకుల శ్రీనివాసరావు కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేసి ఇద్దరూ ఓడిపోయారు. ఆ తర్వాత వెల్లంపల్లి వైసీపీలో చేరి 2019 ఎన్నికలలో జగ్గయ్యపేట నుంచి పోటీ చేసి గెలిచారు.

గత కొంతకాలంగా ఆకుల శ్రీనివాసరావు కూడా వైసీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. నాలుగైదు రోజుల క్రితం ఆయన తన కుమార్తె పెళ్లి శుభలేఖ ఇచ్చేందుకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వెళ్ళారు. అప్పుడు అక్కడే ఉన్న ఎమ్మెల్యే ఉదయభాను ఆయనని వెంటబెట్టుకొని సిఎం జగన్‌ వద్దకు తీసుకువెళ్ళారు.

ఎమ్మెల్యే ఉదయభాను ఆయనని వైసీపీలో చేర్పించేందుకు శుభలేఖ ఇచ్చే వంకతో సిఎం జగన్‌తో కలిపించారని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు అనుమానిస్తున్నారు. ఒకవేళ ఆకుల శ్రీనివాసరావుని వైసీపీలో చేర్చుకొంటే ఆయన తప్పకుండా జగ్గయ్యపేట నుంచే పోటీ చేయాలనుకొంటారు. కనుక ఆయన వలన తన సీటుకి ఎక్కడ ఎసరు వస్తుందో అని వెల్లంపల్లి ఆందోళన చెందడం సహజమే. అందుకే తన సీటుకి ఎసరు పెడుతున్నాడనే కోపంతో ఉదయభానుపై ఆగ్రహంతో చిందులువేసిన్నట్లు అర్దమవుతోంది. ప్రతీ పార్టీలో నేతల మద్య ఇటువంటి గొడవలు సర్వసాధారణమే కానీ ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఉంది కనుక మరికాస్త ఎక్కువగానే ఉంటాయి.