Veerappa Moily says no allaince with any party in Andhra Pradeshఏఐసిసి ముఖ్యనాయకుడు వీరప్ప మొయిలీ ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. దీనితో చాలా కాలంగా టీడీపీ కాంగ్రెస్ మధ్య పొత్తు ఉండే అవకాశం ఉందన్న ఊహాగానాలకు తెర పడింది. ఒకరకంగా ఈ వ్యాఖ్యతో ఆంధ్రప్రదేశ్ తెలుగు దేశం నాయకుల నెత్తి మీద పాలు పోసినట్టు అయ్యింది.

అయితే తెలంగాణాలో పొత్తు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్‌, వామపక్షాలు, తెలంగాణ జన సమితి(తెజస) నేతలు తెదేపా రాష్ట్ర నేతలను సంప్రదిస్తున్నారని సమాచారం. ఈ నెల 8న పార్టీ అధినేత చంద్రబాబు హైదరాబాద్‌కు వస్తున్నారు. రాష్ట్రంలో అనుసరించాల్సిన రాజకీయ వ్యూహాలపై ఆ రోజు చర్చిద్దాం అంటూ ముఖ్యనేతలకు ఆయన సమాచారమిచ్చారు.

ఈలోగా ముందస్తు ఎన్నికల మీద కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ సీట్లకు కాకుండా తెదేపా బలంగా ఉన్న 40 నుంచి 50 సీట్లపై ఎక్కువ దృష్టి పెట్టినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రెండు రాష్ట్రాలకు విడివిడిగా ఎన్నికలు ఉండటం వల్ల తెలంగాణాలో పొత్తుల ప్రభావం ఆంధ్రలో ఉండదని భావిస్తున్నారు.