Veera SivaReddy meet nara lokesh to join TDPగత ఎన్నికల సమయంలో టిడిపికి గుడ్ బై చెప్పి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కమలాపురం మాజీ ఎమ్మెల్యే గుండ్ల వీరశివారెడ్డి ఆ పార్టీలో ఇమడలేక గత కొంతకాలంగా ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన నిన్న హైద‌రాబాద్‌లో టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ను కలిసి పార్టీలోకి తిరిగి రావాలనుకుంటున్నట్లు చెప్పారు. అందుకు ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్లున్నారు. బహుశః అందుకే వీరశివారెడ్డి తరువాత మీడియాతో మాట్లాడుతూ, “నారా లోకేష్‌ను నేను మర్యాదపూర్వకంగా కలిశాను. జిల్లా రాజకీయాలపై చర్చించాము. త్వరలో చంద్రబాబు నాయుడుని కలిసి తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాను,” అని చెప్పారు.

గత ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కమలాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసినపుడు వీరశివారెడ్డి ఆయనకు మద్దతు ఇచ్చి గెలిచేందుకు తోడ్పడ్డారు. వీరశివారెడ్డి కూడా జగన్ సామాజిక వర్గానికి చెందినవారే అయినప్పటికీ మూడేళ్ళయ్యేసరికి మళ్ళీ టిడిపి గూటికి చేరుకోవాలనుకోవడం గమనిస్తే, ఇతర పార్టీల నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినవారి పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కంటే టిడిపిలోనే స్వేచ్ఛ ఉంటుందని భావిస్తుండటం గమనిస్తే రెండు పార్టీలకు మద్య వ్యత్యాసం అర్ధం అవుతుంది.