నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాలో వీరసింహారెడ్డి పాత్ర ద్వారా ఏపీలో అధికార వైసీపీ ప్రభుత్వానికి బాగానే చురకలు వేశారు బాలయ్య. “ఏది అభివృద్ధి హోంమినిస్టర్? ప్రగతి సాధించడం అభివృద్ధి… ప్రజల్ని వేధించడం కాదు. ఉద్యోగులకి సకాలంలో జీతాలు ఇవ్వడమంటే బిచ్చమెయ్యడం కాదు. పనిచేయడం అభివృద్ధి… పనులు ఆపడం కాదు. నిర్మించడం అభివృద్ధి… కూల్చడం కాదు. పరిశ్రమలు తీసుకురావడం అభివృద్ధి… ఉన్న పరిశ్రమలను మూసేయడం కాదు. బుద్ధి తెచ్చుకో… అభివృద్ధికి అర్దం అవుతోంది. తెలుసుకో…” అంటూ బాలయ్య చెప్పిన డైలాగులు వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశ్యించినవే అని వేరే చెప్పక్కరలేదు.
“ఇది రాయల్ సీమ… గజరాజులు నడిచిన దారిలో గజ్జి కుక్కలు కూడా నడుస్తుంటాయి. రాజును చూడు కుక్కని కాదు,” అంటూ బాలయ్య చెప్పిన డైలాగులు రాయలసీమలో చంద్రబాబు నాయుడు ఓ రాజులా పర్యటనలు చేస్తుంటే వైసీపీ నేతలు పదేపదే ఆయనని అడ్డుకొంటూ నీచ రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేయడంగానే భావించవచ్చు.
వీరసింహారెడ్డిలో బాలయ్య పలికిన ఈ డైలాగ్స్ అన్నీ గత మూడున్నరేళ్ళుగా రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలే అని అందరికీ తెలుసు. ఉండవల్లిలో కోట్లు ఖర్చుపెట్టి గత ప్రభుత్వం నిర్మించిన ప్రజావేదికని వైసీపీ అధికారంలోకి వచ్చీ రాగానే కూల్చివేయించింది. ఆ కూల్చివేతలు నేటికీ ఇప్పటం వరకు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక నెలనెలా ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు జీతాల కోసం రోడ్లెక్కి దర్నాలు చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. ఈ మూడున్నరేళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్తగా వచ్చిన ఐటి కంపెనీలు, పరిశ్రమల కంటే బయటకు వెళ్ళిపోయినవి, మూతపడినవే ఎక్కువని అందరికీ తెలుసు.
వీరసింహారెడ్డి పాత్ర ద్వారా బాలయ్య ‘అభివృద్ధి’ అనే పదాన్ని నొక్కి నొక్కి చెప్పడం దేనికో అందరికీ తెలుసు. వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని పక్కనపెట్టేసి, సంక్షేమ పధకాలనే అభివృద్ధిగా చూపిస్తోంది. అందుకే అభివృద్ధి అంటే అది కాదు… రాష్ట్రానికి పరిశ్రమలని రప్పించడమని బాలయ్య కుండబద్దలు కొట్టిన్నట్లు చెప్పారు.
ఈ సినిమాలో ఇన్ని చురకలు వేసినందుకు వైసీపీ ప్రభుత్వం, మంత్రులు స్పందిస్తే గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నట్లవుతుంది. కనుక నిబందనల పేరుతో సినిమా ప్రదర్శనలకి ఆటంకాలు తప్పకపోవచ్చు.