VD12ఎక్కడైనా ఏమో కానీ తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళనే సిద్ధాంతం ఇండస్ట్రీలో పని చేయదు. వీలైనంత త్వరగా ఇది తెలుసుకుంటే కెరీర్ ఎక్కువ కాలం ఉంటుంది. లేదు నేను నమ్మిందే కథ నేను చెప్పిందే సొద అంటే మాత్రం బ్రేక్ తప్పదు. విజయ్ దేవరకొండకు ఈ తత్వం త్వరగానే బోధపడింది. ఇవాళ ప్రకటించిన సినిమాలో పోలీస్ గా నటించబోతున్నట్టు ప్రీ లుక్ పోస్టర్ ద్వారా రివీల్ చేశారు. అది కూడా పీరియాడిక్ డ్రామాగా. రామ్ చరణ్ తో సినిమా లాక్ చేసుకుని ఆ తర్వాత స్క్రిప్ట్ తో మెప్పించలేక తప్పుకున్న గౌతమ్ తిన్ననూరి దీనికి దర్శకుడు.

మళ్ళీ రావా, జెర్సీ లాంటి సెన్సిబుల్ ఎమోషన్స్ ని మాత్రమే డీల్ చేసిన గౌతమ్ ఇప్పుడీ యాక్షన్ ఎంటర్ టైనర్ ని ఎలా డీల్ చేయబోతున్నాడో చూడాలి. చరణ్ కు చెప్పిన కథేనా లేక ఫ్రెష్ దా అనేది స్పష్టంగా బయటికి చెప్పలేదు కానీ కొత్తదేనని టాక్. సరే ఏదైనా ఈ మార్పు రౌడీ హీరోకు మంచిదే. అగ్రెసివ్(విపరీత ప్రవర్తన) హీరోయిజంతో కూడిన లవ్ స్టోరీస్ మాత్రమే సెట్ అవుతాయని భ్రమలో ఉన్న దేవరకొండకు ఈ రియలైజేషన్ చాలా అవసరం. అర్జున్ రెడ్డి టైంలో వచ్చిన విపరీతమైన యూత్ ఫాలోయింగ్ ఆల్రెడీ రిస్క్ లో పడింది.

స్టేజి మీద మైకు పట్టుకుని తోచింది మాట్లాడితే దానికి అభిమానుల స్పందనను నిజమని అనుకుంటూ వచ్చిన విజయ్ కు లైగర్ అనుభవం చాలా పాఠాలు నేర్పింది. సినిమా బాలేకపోయినా కనీసం తన ఇమేజ్ ఓపెనింగ్స్ తెస్తుందని అతిగా అంచనా వేసుకుంటే మార్నింగ్ షో కాగానే దారుణంగా వచ్చిన టాక్ తో పాటు రెండో రోజే పడిపోయిన కలెక్షన్లు వాస్తవాలను తేటతెల్లం చేశాయి. ఎంపికలో జాగ్రత్తగా ఉండకపోతే దెబ్బ పడుతుందని డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ లు హెచ్చరిక చేసినా పట్టించుకోకుండా తగిన మూల్యం చెల్లించాడు.

రాబోయే ఖుషి కూడా లవ్ ఎంటర్ టైనర్ అయినప్పటికీ శివ నిర్వాణ భావోద్వేగాలను బాగా డీల్ చేస్తాడు కాబట్టి అతన్నే నమ్ముకున్నాడు విజయ్. ఎలాగూ సమంతా ఉంది కాబట్టి మార్కెట్ పరంగా బిజినెస్ కు అదనంగా హెల్ప్ అవుతుంది. ఏ హీరో అయినా రకరకాల పాత్రలను చేసినప్పుడు ఏ సవాల్ అయినా స్వీకరించగలడనే అభిప్రాయం నిర్మాతల్లో రచయితల్లో కలుగుతుంది. సో ప్రయోగాలు చేయాల్సిందే. రిస్కులు చేయాల్సిందే. ఛాలెంజులు స్వీకరించాల్సిందే. పన్నెండో సినిమాకు గాని తనలో రావాల్సిన మార్పేమిటో తెలిసిరాలేదు. ఇకపై ఇదే ఆలోచన ధోరణి కొనసాగితే మంచిదే.