vasireddy padma supporting AP Governmentఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మహిళా కమీషన్‌ ఛైర్ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ప్రతిపక్షాలతో పోరాడక తప్పెలాలేదు. రాష్ట్రంలో జరుగుతున్న వరుస అత్యాచారాలు, హత్యలపై ప్రతిపక్షాలు వైసీపీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తుండటంతో ఆ పార్టీకే చెందిన ఆమె రాష్ట్ర మహిళా కమీషన్‌ ఛైర్ పర్సన్‌గా కీలక పదవిలో ఉండటంతో ప్రభుత్వాన్ని వెనకేసుకువస్తూ ప్రతిపక్షాలతో యుద్ధం చేయకతప్పడం లేదు.

ఇటీవల విజయవాడ హాస్పిటల్‌ అత్యాచారం కేసులో ఆమె బాధితురాలిని పరామర్శించడానికి వచ్చిన మాజీ సిఎం, టిడిపి అధినేతకు నోటీసులు ఇచ్చి, టీడీపీ నేతలతో పోరాడుతుండటం చూసిన రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే, మహిళల హక్కులకు భంగం కలిగితే వాటి కోసం మాత్రమే ఆలోచించి తగు చర్యలు తీసుకోవలసిన ఆమె ప్రతిపక్షాలతో అధికార పార్టీ నేతలాగ పోరాడినందుకు! అందుకే ఆమె మహిళా కమీషన్‌ ఛైర్ పర్సన్‌గా నియమితులైనప్పటికీ ఇంకా వైసీపీ వాసనలు పోలేదని టిడిపి మహిళా నేత అనిత ఎద్దేవా చేశారు కూడా.

గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో వరుసగా అత్యాచార్యాలు జరుగుతూనే ఉన్నాయి. కనుక ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీయక మానవు. కనుక వాసిరెడ్డి పద్మ కూడా తన పదవి, హోదాలను పక్కన పెట్టి వైసీపీ ప్రభుత్వం తరపున ప్రతిపక్షాలతో పోరాడేందుకు సిద్దం కాక తప్పదేమో? సిఎం జగన్మోహన్ రెడ్డి ఒకేసారి ముగ్గురు మహిళలకు మంత్రి పదవులులిచ్చి మహిళలను చాలా గౌరవించారని వైసీపీ నేతలు చాలా గర్వంగా చెప్పుకొంటున్నారు. కనుక వాసిరెడ్డి పద్మతో పాటు వైసీపీ ప్రభుత్వంలోని మహిళా మంత్రులు ఆర్‌కె. రోజా (పర్యాటకం), తానేటి వనిత (హోం), విడదల రజని (వైద్య ఆరోగ్యశాఖ) ముగ్గురూ కూడా ఈ ఘటనలపై మాట్లాడక తప్పని పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడ్డాయి.