Vasanth_Venkata_Krishna_Prasadఎన్టీఆర్‌ జిల్లా మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం మైలవరం మండలం చంద్రాల సొసైటీ భవనం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఆయన ప్రజలని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “నేను పుట్టేనాటికే మా తండ్రిగారు రాజకీయాలలో ఉన్నారు. ఆయన తర్వాత నేను గత 55 ఏళ్ళుగా రాజకీయాలలో ఉన్నాను. అయితే కొన్ని దశబ్ధాల క్రితం రాజకీయాలతో పోలిస్తే ఇప్పటి రాజకీయాలు చాలా నీచస్థాయికి దిగజారిపోయాయి.

ఒకప్పుడు ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకొంటే సరిపోయేది. కానీ ఇప్పుడు 10 మంది గూండాలని వెంటేసుకొని తిరుగుతూ ప్రత్యర్ధులపై దాడులు చేస్తూ, సామాన్య ప్రజలని భయబ్రాంతులని చేయగలవాడే రాజకీయనాకుడిగా చలామణి అవుతున్నారు. ఆవిదంగా రౌడీయిజం చేయలేని నేను అటువంటి నయా రాజకీయనాకుల ముందు చేతగాని పాతతరం రాజకీయ నాయకుడిగా మిగిలిపోయాను.

నా నియోజకవర్గంలో సామాన్య ప్రజల చిన్న చిన్న సమస్యలని కూడా పరిష్కరించలేకపోతున్నప్పుడు ఇంకా నేను ఎమ్మెల్యేగా ఎందుకు కొనసాగుతున్నానా? అని నన్ను నేనే ప్రశ్నించుకొంటాను. ఈ మూడున్నరేళ్ళలో నా నియోజకవర్గంలో నేను మా రాజకీయ ప్రత్యర్ధులకి సంక్షేమ పధకాలు అందకుండా అడ్డుపడలేదు. మా రాజకీయ ప్రత్యర్దులను వేధించలేదు. కనీసం వారిపై పోలీసు కేసులు పెట్టించలేదు. ఇందుకు నాపై మా పార్టీ అధిష్టానం బహుశః అసంతృప్తిగా ఉండి ఉండవచ్చునేమో?” అని అన్నారు.

నెల్లూరు వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఇంచుమించు ఇటువంటి అభిప్రాయాలే వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా తన నియోజకవర్గంలో వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళల, వికలాంగుల పింఛన్లు ప్రభుత్వం నిలిపివేస్తుండటంపై బహిరంగంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

వైసీపీ ప్రభుత్వం తీరుని, విధానాలను, నిర్ణయాలని ప్రతిపక్షాలు విమర్శిస్తే మంత్రులు పోటీపడి ఎదురుదాడి చేస్తుంటారు. కానీ సొంత పార్టీలో ఎమ్మెల్యేలే తమ ప్రభుత్వంపై ఈవిదంగా అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తుంటే నోరు మెదపలేకపోతున్నారు. ఎందుకంటే వారికీ తమ అధినేత తీరు, ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల గురించి బాగానే తెలుసు. కానీ తమ పదవులు కాపాడుకొంటూ మళ్ళీ టికెట్‌ సంపాదించుకోవడానికి అందరూ అధినేతని ప్రసన్నం చేసుకొనేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు.