varun tej puri jagannath loafer in bollywoodమెగా వారసుడు వరుణ్ తేజ్ హీరోగా పూరీ జగన్నాధ్ తెరకెక్కించిన మాస్ ఎంటర్ టైనర్ “లోఫర్” ప్రస్తుతం ధియేటర్లలో ప్రదర్శితమవుతోంది. తెలుగు ప్రేక్షకుల నుండి భిన్న స్పందనలు తెచ్చుకున్న ఈ సినిమాను త్వరలో బాలీవుడ్ లోకి రీమేక్ చేస్తానని దర్శకుడు పూరీ జగన్నాధ్ ప్రకటించారు. ‘లోఫర్’ టీం నిర్వహిస్తున్న విజయయాత్రలో భాగంగా నర్సీపట్నంలో దర్శకుడు పూరీ ఈ విధమైన వ్యాఖ్యలు చేసారు.

తెలుగులోనే ఆశించిన ఆదరణకు నోచుకోని ‘లోఫర్’ సినిమాకు అంత సీన్ ఉందా లేదా అన్నది పక్కనపెడితే.., గతంలో మహేష్ తో తెరకెక్కించిన ‘బిజినెస్ మెన్’ చిత్రాన్ని బాలీవుడ్ లోకి రీమేక్ చేస్తానని పూరీ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఈ సమయంలో పూరీ గురువు రాంగోపాల్ వర్మ కూడా రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే, 2012 నుండి ఇప్పటివరకు ఈ చిత్ర రీమేక్ ఊసెత్తిన దాఖలాలు లేవు.

తాజాగా ‘లోఫర్’ సినిమా విషయంలో కూడా పూరీ చేసిన వ్యాఖ్యలు “బిజినెస్ మెన్” స్టోరీనే గుర్తుచేస్తున్నాయి. కేవలం ‘పబ్లిసిటీ’ కోసమేనా లేక నిజంగానే పూరీ ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారా అన్న రీతిలో ట్రేడ్ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. త్వరలో “రోగ్” సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తుండగా, దాని తర్వాత మహేష్ తో ఒకటి, ఆ పైన అంతా కొత్త వారితో మరొకటి పూరీ చేయబోతున్నారు. మరి “లోఫర్” రీమేక్ మాటేంటి… అంటే… “ఆ ఒక్కటీ అడక్కు..!” అనే సమాధానం వస్తుంది.