varun tej loaferమరో మూడు రోజుల్లో మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన “లోఫర్” సినిమా విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహించినప్పటికీ పెద్దగా అంచనాలు ఏర్పడలేదు. దీంతో ‘మెగా’ సినిమాల విడుదలకు ముందు ఫ్యాన్స్ చేసే సందడి కనపడడం లేదు. అలాగే దర్శకుడు పూరీ కూడా సెంటిమెంట్ పాటనే హైలైట్ గా చెబుతూ, ప్రమోషన్లకు కూడా దానికి సంబంధించిన వీడియోనే విడుదల చేసారు.

‘మాస్’ సినిమాలంటే ఊగిపోయే ‘మెగా’ అభిమానులకు ఈ సెంటిమెంట్ పాట కావాల్సినంత ‘కిక్’ ఎక్కించలేదు. ఈ కారణంతో ‘లోఫర్’ సినిమాకు రావల్సినంత ‘హైప్’ రాలేదు. దీనికి తోడు విడుదల చేసిన ధియేటిరికల్ ట్రైలర్ కూడా అంతంత మాత్రంగానే అలరించింది. ఈ రెండింటి ప్రభావం చిత్ర ఓపెనింగ్స్ పై ఖచ్చితంగా పడే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ వంటి ప్రదేశాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైనప్పటికీ ప్రేక్షకుల నుండి ఆశించినంత స్పందన లేకపోవడం గమనించదగ్గ విషయమే.

ప్రస్తుతం “లోఫర్” సినిమాపై ఏ మాత్రం హైప్ రావాలన్నా, వెంటనే ఫుల్ మాస్ డైలాగ్స్ తో కూడిన ఓ ‘మెగా మాస్’ ట్రైలర్ అత్యవసరం. చిత్ర యూనిట్ ఈ దిశగా ఆలోచన చేస్తుందో లేదో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.