Varun Tej Fidaa breaks jr ntr recordsమెగా హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ కు “ఫిదా” ముందు వరకు బాక్సాఫీస్ వద్ద సంపూర్ణ విజయం సాధించిన చిత్రం ఒక్కటీ లేదు. క్రిష్ ‘కంచె’ విమర్శకుల ప్రశంసలు అయితే పొందింది గానీ, బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపించలేకపోయింది. అలాంటి వరుణ్ తేజ్ ప్రస్తుతం “ఫిదా” సినిమాతో ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ సినిమా కలెక్షన్స్ నే దాటిపోయాడు. షాకింగ్ లాంటి వార్తే అయినా… శేఖర్ కమ్ముల ‘ఫిదా’ సినిమాకు ప్రేక్షకులు ఏ స్థాయిలో పట్టం కట్టారో అర్ధం చేసుకోవచ్చు.

పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన “టెంపర్” సినిమా ఓవరాల్ గా 40 కోట్ల క్లబ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా కలెక్షన్స్ ను ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోన్న “ఫిదా” వెనక్కి నెట్టిందనేది ట్రేడ్ వర్గాల లేటెస్ట్ న్యూస్. ఏపీ, తెలంగాణాలతో పాటు ఓవర్సీస్ లోనూ దుమ్ము దులుపుతున్న ‘ఫిదా’ ఏకంగా వరుణ్ తేజ్ ను 2 మిలియన్ క్లబ్ లో నిలబెట్టనుంది. మెగా హీరోలలో చిరు తర్వాత 2 మిలియన్ క్లబ్ లో చేరనున్న హీరోగా వరుణ్ నిలవనున్నాడు.

అయితే “ఫిదా” ద్వారా వచ్చిన మార్కెట్ ను వరుణ్ ఎలా కన్వేర్ట్ చేసుకుంటారు అన్నది ప్రశ్నగా మారింది. ఎందుకంటే… ‘ఫిదా’ సినిమాలో హీరో వరుణ్ అయినా… అది విడుదలైంది శేఖర్ కమ్ముల బ్రాండ్ సినిమాగా! అలాగే సినిమా విజయంలో సింహభాగం హీరోయిన్ సాయిపల్లవికి వెళ్లిపోయింది. అలాగే ఇంత ప్రజాధరణ పొందడానికి నిర్మాత దిల్ రాజు ప్లానింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇలా వరుణ్ కంటే హైలైట్ అయిన అంశాలు మూడు ఉండడంతో, వరుణ్ అసలు రేంజ్ ఏంటన్నది తదుపరి సినిమాల ద్వారా తెలియనుంది.