Varun Sandesh Wife Vithika Sheru Suicide fake newsమంగళవారం నాడు తెలుగు చిత్ర పరిశ్రమలో కలకలం రేపే రెండు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అందులో ఒకటి అక్కినేని అఖిల్ – వెంకటేష్ కుమార్తెకు సంబంధించి కాగా, మరొకటి వరుణ్ సందేశ్ – వృతికా శేరు ఉదంతం. ఇద్దరు కలిసి ఓ రెండు సినిమాలలో నటించిన తర్వాత ఒక్కటైన వరుణ్ – వృతికాల జంట మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయని, దీంతో వృతికా ఆత్మహత్యకు పాల్పడిందని, ఆమె పరిస్థితి సీరియస్ గా ఉందని, ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.

అయితే దీనిపై స్వయంగా వృతికా శేరు వివరణ ఇచ్చారు. “తన స్నేహితులతో కలిసి మాదాపూర్ కి డిన్నర్ కి వెళ్లానని… ఈ లోగా తన పిన్ని, ఇతర స్నేహితులు ఫోన్ చేసి, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల గురించి చెబుతూ, ‘సూసైడ్ అటెంప్ట్ చేశావా?’ అని అడుగుతున్నారని, దాంతో ఆశ్చర్యపోయానని చెప్పింది. గతంలో నిద్రమాత్రలు వేసుకుని నిద్రపోయినప్పుడు డోస్ ఎక్కువై ఆసుపత్రి పాలయ్యానని, అప్పటి ఫోటోలను ఇప్పుడు పోస్ట్ చేస్తూ, తాను సూసైడ్ అటెంప్ట్ చేశానని, తనను ఆసుపత్రిలో చేర్చారని పుకార్లు రేపారని, వాటిని చూసి వరుణ్ సందేశ్, తాను నవ్వుకున్నామని స్పష్టం చేసింది.

దీంతో వరుణ్ సందేశ్ – వృతికా శేరుల ఘటనకు శుభంకార్డు పడింది. ఇక మరో కీలక అంశం ఏమిటంటే… అక్కినేని అఖిల్ తో విక్టరీ వెంకటేష్ కుమార్తె వివాహం ఖరారైందని మరో వార్త ప్రధానంగా చక్కర్లు కొట్టింది. శ్రేయా భూపాల్ తో నిశ్చితార్ధం జరిగి, విడిపోయిన అఖిల్ కు తన కూతురిని ఇచ్చేందుకు వెంకటేష్ కూడా సంసిద్ధంగా ఉన్నట్లు చెలరేగిన ఈ వార్తల్లో వాస్తవం ఎంత ఉందనేది తెలియరాలేదు. అయితే దగ్గుపాటి అమ్మాయిని ఒకసారి అక్కినేని ఇంట అడుగుపెట్టగా, చివరికి అది నిరాశజనకమైన ఫలితాన్ని ఇవ్వడంతో, మళ్ళీ అక్కినేని వారింటికి దగ్గుపాటి అమ్మాయిని ఇస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

ఇటీవల కాలంలో పుకార్లను వెనువెంటనే ఖండిస్తున్న అక్కినేని ఫ్యామిలీ, సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన ఈ న్యూస్ పై మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. అయితే దీనిపై మీడియా వర్గాలు మాత్రం ఓ స్పష్టమైన సమాచారాన్ని ప్రసారం చేసాయి. ప్రస్తుతం చదువుకుంటున్న వెంకటేష్ తనయురాలి వివాహం ఆమె నిర్ణయం ప్రకారమే ఉంటుందని దగ్గుపాటి ఫ్యామిలీ ధృవీకరించినట్లుగా తేలింది. అలాగే అఖిల్ వివాహం గురించి ఆసలు ఈ రెండు ఫ్యామిలీల నడుమ చర్చ కూడా రాలేదని అక్కినేని కుటుంబం కూడా చెప్పడంతో ఇది కూడా ఓ ఫేక్ న్యూస్ గా తేలిపోయింది.

సినీ సెలబ్రిటీలపై సహజంగా ఉండే క్రేజ్ రీత్యా… సినీ జీవితానికి సంబంధించిన విషయాల కంటే వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలు సోషల్ మీడియాలో ఎక్కువగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే అందులో ఎక్కువ ఇలాంటి ఫేక్ న్యూస్ కావడం విశేషం.