Vangaveeti Radha TDP MLCఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంటుంది. ఎలాగైనా తిరిగి అధికారంలోకి రావాలని చంద్రబాబు, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అని జగన్, ఎలాగైనా సత్తా చూపించాలని పవన్ కళ్యాణ్ పట్టుదలగా ఉన్నారు. ఎన్నికలకు ముందే ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతుండడంతో కొంత మంది టిక్కెట్టు ఇవ్వలేని ఆశావహులను తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం వేరే పార్టీ వారిని తీసుకుని వారికి పదవులు ఇవ్వాల్సిన పరిస్థితి.

ఇప్పటివరకూ వైఎస్సాఆర్ కాంగ్రెస్ లో ఉండి తెలుగుదేశం పార్టీని, ప్రభుత్వాన్నీ తీవ్రంగా విమర్శించిన ఆదిశేషగిరి రావు, వంగవీటి రాధా వంటి వారు ఆ పార్టీని వీడి తెలుగుదేశం లో చేరడానికి సిద్ధం అవుతున్నారు. వీరి ఇరువురికి కూడా ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం. ఈ లిస్టు ఇక్కడితో ఆగుతుందన్న నమ్మకమూ లేదు. అయితే ఎప్పటి నుండో పార్టీని అంటి పెట్టుకుని పార్టీ కోసమే పని చేస్తున్న వారి సంగతి ఏంటి? నిబద్ధతకు, పార్టీ మీద అభిమానానికి ఇంక విలువ ఏమి ఉన్నట్టు? ప్రతీ రాజకీయ పార్టీకి రాజకీయ అవసరాలు ఉండటం సహజమే.

అందులోనూ ఎన్నికల ముంగిట కొంత మేర సర్దుబాట్లు ఎవరికైనా తప్పవు. అయితే జంప్ జిలానీలు పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీ తరపున నిలబడ్డారు కదా? కావున నిజమైన కార్యకర్తలను గుర్తిస్తే అది చంద్రబాబుకే మంచిది. 10 సంవత్సరాలు ఆంధ్రలో ప్రతిపక్షంలో ఉండి , ఇప్పుడు తెలంగాణలో 20 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండబోతున్న తెలుగుదేశం కు ఈ విషయం తెలియనిదికాదు తెలుగుదేశం పార్టీలో నామినేటెడ్ పదవుల పందేరం ఎప్పుడూ వివాదాలకే దారి తీస్తుంది. మరి ఎన్నికల వేళ ఇది ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.